కాంగ్రెస్​ది అబద్ధపు ప్రచారం : కేంద్ర మంత్రి  కిషన్ రెడ్డి

  • రాష్ట్రంలో బాధ్యత లేకుండా పనిచేస్తున్నది: కిషన్ రెడ్డి
  • హామీలను గుర్తుచేసేందుకు హైదరాబాద్​లో సభ పెడతామని వెల్లడి

న్యూఢిల్లీ, వెలుగు: ఇచ్చిన హామీలను అమలు చేయకుండా అబద్ధపు ప్రచారాలతో కాంగ్రెస్  ప్రభుత్వం బాధ్యతారహితంగా పనిచేస్తోందని కేంద్ర మంత్రి, బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్  రెడ్డి అన్నారు. అధికారంలోకి రాగానే వందరోజుల్లో ఆరు హామీలను పూర్తిచేస్తామని సోనియా, రాహుల్ గాంధీ  తెలంగాణ ప్రజలకు లేఖ రాశారని గుర్తుచేశార. కానీ, ఆ హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్  చతికిలపడిందని ఎద్దేవా చేశారు. గురువారం ఢిల్లీలో ఒక ప్రైవేట్ హోటల్ లో కేంద్ర బొగ్గు, గనుల శాఖ ఆధ్వర్యంలో 11వ విడత కమర్షియల్  గనుల వేలం నిర్వహించారు. కిషన్ రెడ్డి సమక్షంలో ఈ వేలం కొనసాగింది.

అనంతరం మీడియాతో కిషన్  మాట్లాడారు. ఏడాది పూర్తవుతున్నా కాంగ్రెస్  హామీలు అమలుకాలేదన్నారు. ‘‘ఇప్పటికే వంద రోజులు పూర్తయ్యాయి. 200 రోజులు కూడా దాటిపోయాయి. మరికొద్ది రోజుల్లో 365 రోజులు కూడా పూర్తికానున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్  పార్టీ హామీలను గుర్తుచేసేందుకు బీజేపీ ఆధ్వర్యంలో త్వరలో హైదరాబాద్ లో సభ నిర్వహిస్తాం. తెలంగాణ బిడ్డలను కాంగ్రెస్  ఎలా మోసం చేసిందో ప్రజలకు వివరిస్తాం” అని కిషన్  రెడ్డి తెలిపారు.

కోల్ సెక్టార్​లో  సంస్కరణలు తెస్తున్నం 

సుప్రీంకోర్టు ఆదేశాలతో కోల్ సెక్టార్ లో సంస్కరణలను తెచ్చి పారదర్శకంగా వేలంపాట నిర్వహిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో ప్రధానిగా నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టాక కోల్  సెక్టార్  పారదర్శకంగా నడుస్తోందన్నారు. కాంగ్రెస్  హయాంలో పార్టీ కోశాధికారి తెల్ల కాగితంపై పేర్లు రాసి ప్రధానికి పంపే కల్చర్ ఉండేదన్నారు. అలా నచ్చిన వాళ్లకు కోల్ మైన్స్ ను కాంగ్రెస్  కట్టబెట్టిందని విమర్శించారు. దేశ అవసరాలకు అనుగుణంగా కోల్  ప్రొడక్షన్ చేస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి మరింత పెంచి, దిగుమతులు తగ్గిస్తామని చెప్పారు. ఈ ఏడాది 1080 మెట్రిక్  టన్నుల కోల్  ఉత్పత్తిని టార్గెట్ గా పెట్టుకున్నామని వెల్లడించారు.