దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75ఏళ్లు అవుతున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ గోల్కొండ కేశవ్ మెమోరియల్ ఇనిస్టిట్యూట్‌లో తెలుగు స్వాతంత్ర్య సమరయోధులకు సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్‌ను కిషన్ రెడ్డి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రారంభించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధుల చరిత్రను నేటి తరానికి తెలియచేస్తున్నామన్నారు. ఆజాద్ కా అమృత్ మహోత్సవ పేరుతో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. సుభాష్ చంద్రబోస్ చరిత్రను ప్రజలకు అందించామన్నారు. హైదరాబాద్ లో గిరిజన మ్యూజియం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం 15కోట్లు ఇచ్చిందన్నారు.
గిరిజన బిడ్డల చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు కేంద్రం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు కిషన్ రెడ్డి. రాబోయే 25ఏళ్లలో ప్రపంచంలోనే భారత్ ను విశ్వగురువు స్థానంలో నిలపాలన్నారు. పనికిరాని సిద్ధాంతాలు పట్టుకుని కొంతమంది పని చేస్తున్నారని విమర్శించారు. వచ్చే సెప్టెంబర్ 17కి తెలంగాణకు విముక్తి కలిగి 75ఏళ్లు పూర్తి అవుతుందన్నారు. నిజాం, రజాకార్ల దౌర్జన్యాలను నేటి తరానికి కవులు, కళాకారులు తెలియజేయాలని కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.