రాష్ట్రంలో 60 శాతం కేసులు మర్కజ్ కు వెళ్లొచ్చిన వారివే

రాష్ట్రంలో 60 శాతం కేసులు మర్కజ్ కు వెళ్లొచ్చిన వారివే

హైద‌రాబాద్ : నగరంలోని బీజేపీ కార్యాలయంలో మెడికల్ పోర్టల్ ప్రారంభమైంది. కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఢిల్లీ నుంచి ఆన్‌లైన్ ద్వారా ఈ పోర్టల్‌ను ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో వృద్ధులు, మహిళలు, దివ్యాంగులకు ఈ పోర్టల్ ద్వారా అత్యవసర వైద్య సేవలను అందించనున్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కరోనాను ఎదుర్కొనేందుకు కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాలు అంకిత భావంతో పని చేస్తున్నాయ‌న్నారు. ఇంకా కొన్ని నగరాలు, పట్టణాల్లో అధికంగా పాజిటివ్ కేసులు వస్తున్నాయ‌ని, ఇందుకు కారణం మర్కజ్ వెళ్లి ప్రార్థనలు చేసినవారు.. తెలంగాణతో పాటు దేశం లోని అన్ని రాష్ట్రాలకు వెళ్ళారని చెప్పారు. రాష్ట్రంలో 60 శాతం కేసులు మర్కజ్ కు వెళ్లి వచ్చిన వారివేన‌న్నారు. 50 శాతం కేసులు హైదరాబాద్ నుండే వచ్చాయని, ఒక్కో ఇంటి నుండి 20.. 30 కేసులు వస్తున్నాయన్నారు.

కేంద్ర ప్రభుత్వం అధికారుల బృందాన్ని రాష్ట్రానికి పంపింద‌ని, రాష్ట్ర ప్రభుత్వానికి సహకరించడం, సలహాలిచ్చేందుకు ఈ బృందం పని చేస్తోందని చెప్పారు. కేంద్రం కొన్ని మినహాయింపులు ఇచ్చినా.. రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో లాక్‌డౌన్‌ అమలు చేస్తోందన్నారు కిష‌న్ రెడ్డి. ఆసుపత్రుల్లో ఓపీ సేవలు నిలిపివేయడంతో ఎమర్జెన్సీ కేసులు పూర్తిగా తగ్గిపోయాయని, ఇదో విచిత్రమైన పరిస్థితి అని చెప్పారు. ‘‘ అనారోగ్యానికి గురైతే ఎక్కడికి వెళ్లాలో కూడా తెలియని పరిస్థితి. ఇలాంటి వారిని ఆదుకోవాల్సిన అవసరముంది. ఆరోగ్య సేతు యాప్‌లో ఆరోగ్య వివరాలు పొందుపరిస్తే… తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెబుతుంది. అందరూ ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుంటే… మీ చుట్టూ ఉన్న వారికి కరోనా ఉంటే అలర్ట్‌ చేస్తుంది. ఇది బాడీగార్డ్ లా పని చేస్తుందని” తెలిపారు.

“చాలా మంది డాక్టర్లు…. ప్రజలకు సేవలందిస్తామని చెబుతున్నారు. ఒత్తిడిలో ఉన్నా…. ప్రజాసేవకు ముందుకు వచ్చిన వారికి అభినందనలు. పేదలను వైద్య పరంగా ఆదుకునేందుకు డాక్టర్ల బృందంతో మాట్లాడి ప్రతి నియోజకవర్గంలో వారికి సేవలందించేందుకం సిద్ధంగా ఉన్నాం. ప్రతి అసెంబ్లీలో నియోజకవర్గంలో సేవకులు ఉంటారు. ఏదైనా అనారోగ్యంతో బాధ పడుతుంటే సంబంధిత డాక్టర్లకు ఫోన్ చేస్తే వైద్య స‌హాయం అందిస్తారు. అన్ని విభాగాల డాక్టర్లు ఇందులో ఉన్నారు. హైదరాబాద్ పరిధిలో ఒక్కో డాక్టర్ కు ఇద్దరు బీజేపీ కార్యకర్తలు అసిస్టెంట్ లు గా ఉంటారు. ఈ కార్యక్రమం వృద్దులు, మహిళలు, దివ్యాంగులకోసం ఏర్పాటు చేశాం కాబ‌ట్టి వారికే మొదటి ప్రాధాన్యం ఉంటుంది. లాక్డౌన్ సమయంలో ఈ డాక్టర్ల సేవలను వినియోగించుకోవాలి. దివ్యాంగులు, వృద్దులకు ఇంటికే త‌మ స‌హా‌య‌కులు మెడిసిన్ తెచ్చిస్తారు”   అని కిష‌న్ రెడ్డి అన్నారు

సేవ చేసే వారికైనా.. సోష‌ల్ డిస్టాన్స్ త‌ప్ప‌నిస‌రి

కొన్నిచోట్ల ప్రజలు లాక్ డౌన్‌కు సహకరించడం లేదని, దీంతో కొద్దిగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు కిష‌న్ రెడ్డి. సెల్ఫ్ క్వారెంటైన్ చేసుకొని మన కుటుంబ సభ్యులను మ‌న‌మే కాపాడుకోవాలన్నారు. కోవిడ్ కు వ్యతిరేకంగా పోరాడుతున్న వారు, సేవలు చేస్తున్న వారు త‌గిన జాగ్తత్తలు తీసుకోవాలన్నారు. ప్రజలకు ఏ సేవ చేసేందుకు ముందుకు వచ్చినా.. సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యాలన్నారు. పేదలు‌, వృద్దులు, మహిళలు సేవలు అడిగితే విసుక్కోకుండా వారికి సేవ చేయాలన్నారు . అందరికీ మనం అండగా ఉన్నామన్న భరోసానివ్వాలని చెప్పారు. హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నవారు త‌మ హెల్ప్ లైన్ నంబ‌ర్ 9959261273 కి కాల్ చేయొచ్చని లేదా kishanreddy.com అనే వెబ్ సైట్ లో లాగిన్ అయి జబ్బు వివరాలు డాక్టర్స్ కు వివరించవచ్చన్నారు. ఈ మెడిక‌ల్ పోర్ట‌ల్ ప్రారంభానికి బీజేపీ నేతలు ప్రకాష్ రెడ్డి, గౌతమ్ రావు, అజయ్, డాక్టర్లు సురేష్ గౌడ్, జిగ్నేశ్ గోకాని హాజర‌య్యారు.