బషీర్ బాగ్,- వెలుగు: జాతీయ స్థాయి మహాసభలు హైదరాబాద్‌లో జరగడం మనకు గర్వకారణమని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. అబిడ్స్ స్టాన్లీ కాలేజీలో ఆదివారం జరిగిన లోక్‌మంథన్ భాగ్యనగర్ – 2024 సక్సెస్ మీట్లోఆయన పాల్గొన్నారు. అడవుల్లో జీవించే వారి జీవన విధానాలు, వారి హక్కులను కాపాడడం, విద్యార్థుల్లో జాతీయ భావాన్ని పెంపొందించి మన సంస్కృతి సాంప్రదాయాలను రక్షించడమే లోక్‌మంథన్ ముఖ్య ఉద్దేశమన్నారు.
లోక్‌మంథన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివిధ రకాల ఎగ్జిబిషన్స్‌లో నగరంలోని వివిధ విద్యా సంస్థలకు చెందిన 3 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి సహకరించిన వివిధ కాలేజీలు, పాఠశాల యాజమాన్యాలను కిషన్ రెడ్డి సన్మానించారు.