
- కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: విదేశీ దురాక్రమణదారు ల కుట్రల కారణంగా బంజారాలు చెల్లాచెదురయ్యారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మతమార్పిడులు విస్తృతంగా జరుగుతున్న సందర్భంలో.. సంత్ సేవాలాల్ చూపిన మార్గం అత్యంత విలువైనదని ఆయన కొనియాడారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో బంజారా ధార్మిక వ్యాప్తి మహాసంఘ్ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన సంత్ సేవాలాల్ జయంతి కార్యక్రమానికి కిషన్ రెడ్డి హాజరయ్యారు. భోగ్ భండార్ కార్యక్రమంలో పాల్గొని సేవాలాల్ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. విదేశీయుల దండయాత్ర నుంచి దేశాన్ని కాపాడే ప్రయత్నంలో ఆదివాసుల పాత్ర కీలకమని పేర్కొన్నారు. ప్రకృతిని, సహజ వనరులను కాపాడుకోవాల్సిన అవసరాన్ని సేవాలాల్ మహారాజ్ ఆచరించి చూపారని కొనియాడారు. బంజారా భాషకు గుర్తింపు ఇచ్చే దిశగా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.