తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్..రేవంత్ సర్కారుపై ప్రజలు విరక్తి చెందారు: కిషన్ రెడ్డి

తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్..రేవంత్ సర్కారుపై ప్రజలు విరక్తి చెందారు: కిషన్ రెడ్డి

హైదరాబాద్, వెలుగు: తెలంగాణలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ తప్పకుండా వస్తుందని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో ఢిల్లీని మరింత అభివృద్ధి చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆదివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో పార్టీ కార్యకర్తలు పటాకులు కాల్చి విజయోత్సవ సంబురాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న రాష్ట్రాల్లోనే అభివృద్ధి జరుగుతున్నదని చెప్పారు.

ఎంపీ లక్ష్మణ్ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ చారిత్రక విజయం సాధించిందని, దేశమంతా కమలం వికసిస్తున్నదన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారుపై ప్రజలు విరక్తి చెందారని, కమలం వికసించాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. కాగా, అంతకు ముందు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో స్టేట్ ఆఫీసులో సమావేశం జరిగింది. రాష్ట్రంలో జరుగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారం పాల్గొని, అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కిషన్ రెడ్డి వారికి సూచించారు. 

కాంగ్రెస్‌‌‌‌తో జత కట్టేందుకు కేటీఆర్ ఆహ్వానం..

లిక్కర్ స్కామ్ భాగస్వామి కేజ్రీవాల్ ఢిల్లీలో ఓడిపోవడంతో.. బీఆర్ఎస్ పార్టీలో కలవరం మొదలైనట్లుందని కిషన్ రెడ్డి అన్నారు. దీంతో పాత దోస్తు కాంగ్రెస్‌‌‌‌తో మరోసారి జతకట్టేందుకు కేటీఆర్ బహిరంగ ఆహ్వానం పలికారన్నారు. బీజేపీని ఓడించేందుకు ప్రాంతీయ పార్టీలతో జత కట్టాలంటూ రాహుల్ గాంధీకి కేటీఆర్ సూచించడంపై ఆదివారం కిషన్ రెడ్డి ‘ఎక్స్’లో స్పందించారు. కేసీఆర్ రాజకీయ జీవితం కాంగ్రెస్‌‌‌‌తోనే మొదలైందని, 2004లో ఆ పార్టీతో కలిసి ఎన్నికల్లో గెలిచి యూపీఏలో కేంద్ర మంత్రి అయ్యారని గుర్తుచేశారు.

2014లో బీఆర్ఎస్‌‌‌‌ను కాంగ్రె‌‌‌‌స్‌‌‌‌లో విలీనం చేసేందుకు కూడా కేసీఆర్ సిద్ధమయ్యారని తెలిపారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేవలం రూ.2 లక్షలకే కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కోసం పదెకరాల విలువైన స్థలాన్ని అప్పగించిందని, కానీ, పేదల ఇండ్ల కోసం మాత్రం స్థలం ఇవ్వలేదని మండిపడ్డారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ బీజేపీని ఓడగొట్టేందుకు కూటమి ప్రభుత్వంలో చేరేందుకు సిద్ధమేననే సంకేతాలను కేటీఆర్ ఇచ్చారని తెలిపారు.

కాంగ్రెస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు బీఆర్ఎస్‌‌‌‌లో చేరి మంత్రులయ్యారని, ఆ తర్వాత బీఆర్ఎస్ జెండాపై గెలిచిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌‌‌‌లో చేరారని గుర్తుచేశారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఓడించేందుకు ఈ రెండు పార్టీలు ఒక్కటయ్యాయన్నారు. ఢిల్లీ సర్వీసెస్ బిల్లు సందర్భంలోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి, కాంగ్రెస్ తీర్మానానికి బీఆర్ఎస్ పార్టీ బహిరంగంగా మద్దతిచ్చిందన్నారు. మరోసారి బహిరంగంగా దోస్తీకి ఈ రెండు కుటుంబ పార్టీలు సిద్ధమయ్యాయని ఆరోపించారు