- గ్రామస్తులతో సీఎం మాట్లాడి సమస్య ఏంటో తెలుసుకోవాలి
- ఫార్ములా రేసు కేసులో గవర్నర్ నిర్ణయంపై తొందరెందుకు?
- ఆలస్యమైనంత మాత్రానా బీజేపీ,బీఆర్ఎస్ ఒక్కటనడం సరికాదు
- సీఎం రేవంత్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నారని ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు:వికారాబాద్ కలెక్టర్‌పై దాడి చేయడం తప్పేనని, కానీ ఈ ఘటనలో లగచర్ల గ్రామస్తులపై కేసులు పెట్టడం సరికాదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘‘సీఎం సొంత నియోజకవర్గంలో ఈ దాడి జరిగింది. సీఎంగా, నియోజకవర్గ ఎమ్మెల్యేగా గ్రామ ప్రజలతో రేవంత్ రెడ్డి మాట్లాడి అసలు సమస్య ఏంటో తెలుసుకోవాలి” అని సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరుగుతున్న ఇండియన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్-–2024 (ఐఐటీఎఫ్)లో గనుల శాఖ పెవిలియన్‌ను కిషన్ రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ, ప్రైవేట్ మైనింగ్ కంపెనీలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను సందర్శించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.ఫార్ములా రేసు కేసులో కేటీఆర్‌ను విచారించే విష యంలో గవర్నర్ నిర్ణయంపై తొందరెందుకని కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. ‘‘రాష్ట్రపతి, గవర్నర్ నిర్ణయం తీసుకు నేముందు లీగల్ ఒపీనియన్ తీసుకుంటారు. దీంతో కొంత జాప్యం జరగడం సహజం. అంతమాత్రానికే తొందరపాటు వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఈ విషయంలో సీఎం రేవంత్ రెడ్డి మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నరు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్ప డం రేవంత్ అవివేకం. అవినీతి ఎక్కడ జరిగినా, ఏ పార్టీ చేసినా ఎంక్వైరీ చేలన్నదే మా డిమాండ్” అని చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ దొందూదొందే..
ఇప్పటి వరకు ప్రభుత్వం పంపిన చాలా ప్రతిపాదనలు, ఇతర అంశాలకు గవర్నర్ అనుమతులిచ్చారని కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘గవర్నర్ తొందరగా అనుమతిస్తే బీఆర్ఎస్ విమర్శలు చేస్తున్నది. ఒకవేళ లేటైతే కాంగ్రెస్ ఆరోపణలు చేస్తున్నది. కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యవహరిస్తున్న తీరుతో రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. తమ అవినీతి, వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్ఎస్.. తమ అసమర్థ పాలన నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్ వి ద్వంద్వ విధానాలు. ఈ రెండు పార్టీలు దొందూదొందే” అని విమర్శించారు.
మేం ఎవ్వరితోనూ కల్వలేదు..
కేంద్ర మంత్రులు ఏం చేయాలి? ఏం చేస్తున్నారనే విషయంలో కేసీఆర్, కేటీఆర్ ఇచ్చే సర్టిఫికెట్లు తమకు అవసరం లేదని కిషన్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ హయాంలో అధికారిక కార్యక్రమాల కోసం ప్రధాని మోదీ హైదరాబాద్ వస్తే కనీసం రిసీవ్ చేసుకునేందుకు రాని మొఖాలకు (కేసీఆర్, కేటీఆర్) కేంద్రమంత్రుల గురించి మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు. ‘‘బీజేపీ అందరికీ అల్కగ దొర్కుతది. కాంగ్రెస్, బీజేపీ కలిసిపోయిందని బీఆర్ఎస్ వాడు అంటడు. బీఆర్ఎస్, బీజేపీ కలిసిపోయిందని కాంగ్రెస్ వాడు అంటడు. మేం ఎవ్వరితోనూ కల్వలేదు.. తెలంగాణ ప్రజలతో తప్ప’’ అని అన్నారు. అమృత్ స్కీంతో పాటు అన్ని అవినీతి అంశాలపై విచారణ జరగాల్సిందేనని, ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకురావాలని కోరారు.