దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి...రూ.83 వేల కోట్లు కేటాయించినం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

దక్షిణ మధ్య రైల్వే అభివృద్ధికి...రూ.83 వేల కోట్లు కేటాయించినం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • తెలంగాణలో 40 స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • 90% ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడి
  • తెలంగాణ, కర్నాటక ఎంపీలతో రైల్వే శాఖ సమీక్ష
  • సెగ్మెంట్ల వారీగా సమస్యల పరిష్కారానికి జీఎం హామీ

సికింద్రాబాద్, వెలుగు: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో కొనసాగుతున్న అభివృద్ధి పనులకు కేంద్రం రూ.83 వేల కోట్లు కేటాయించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో కొత్త లైన్లు, డబుల్ లైన్లు, గేజ్ మార్పిడి కింద 415 కిలో మీటర్ల అదనపు ట్రాక్​లు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం ఎంపిక చేశామని, రూ.2,635 కోట్లతో ఆధునికీకరణ పనులు చేపడ్తున్నామని వివరించారు.

90 శాతం ఎలక్ట్రిఫికేషన్ లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల్లో దక్షిణ మధ్య రైల్వే చేపడుతున్న అభివృద్ధి పనులపై కిషన్ రెడ్డి అధ్యక్షతన ఎంపీలు రైల్వే అధికారులతో సమావేశం అయ్యారు. సికింద్రాబాద్​లోని రైల్ నిలయంలో జరిగిన ఈ మీటింగ్​కు రెండు రాష్ట్రాలకు చెందిన పది మంది ఎంపీలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు.

‘‘రూ.650 కోట్లతో వరంగల్​లో రైల్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్ రాబోతున్నది. రాబోయే రోజుల్లో అక్కడే వ్యాగన్లు, కోచ్​లు తయారవుతాయి. దీంతో 3వేల మందికి ఉపాధి దొరుకుతది. రాష్ట్రంలో ఫైనల్ లొకేషన్ సర్వేలు చేయాలని రైల్వే బోర్డు అంగీకరించింది. 15 ప్రాజెక్టుల కింద 2,640 కిలో మీటర్ల ట్రాక్ అభివృద్ధికి ప్రపోజల్స్ పెట్టినం. దీనికి రూ.50 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నం. రూ.750 కోట్లతో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్​ను డెవలప్ చేస్తున్నం. రూ.430 కోట్లతో చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను నిర్మిస్తున్నం’’అని కిషన్ రెడ్డి తెలిపారు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగించాలని నిర్ణయించామన్నారు. 

జర్నలిస్టుల రైల్వే పాస్​లు పునరుద్ధరించండి: మెదక్ ఎంపీ రఘునందన్ రావు

జర్నలిస్టులు, దివ్యాంగులకు రైల్వే పాస్​లు పునరుద్ధరించాలని మెదక్ ఎంపీ రఘునందన్ రావు రైల్వే అధికారులను కోరారు. కొన్నేండ్లుగా పాస్​లు నిలిపివేశారని, దీంతో ట్రైన్ జర్నీపై రాయితీ లభించడం లేదని తెలిపారు. ‘‘మెదక్ పార్లమెంట్ సెగ్మెంట్​లోని ఈదుల నాగుపల్లి స్టేషన్​ను అభివృద్ధి చేయాలి. ఇప్పటికే దీని కోసం 500 ఎకరాలు సేకరించారు. అజంతా, రాయలసీమ ఎక్స్​ప్రెస్ హాల్టింగ్​లు పెంచాలి. మనోహరాబాద్, కొత్తపల్లి రైల్వే లైన్​ను పూర్తి చేయాలి’’అని రఘునందన్ రావు విజ్ఞప్తి చేశారు. 

భద్రాచలం రైల్వేలైన్ పూర్తి చేయండి: ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి

భద్రాచలం రైల్వే లైన్ అందుబాటులోకి తేవాలని ఖమ్మం ఎంపీ రఘురామ్ రెడ్డి రైల్వే అధికారులను కోరారు. ‘‘రాములోరి టెంపుల్​కు వెళ్లే భక్తులకు ఎంతో సౌకర్యంగా ఉంటది. వీలైనంత తొందరగా రైల్వే లైన్ పనులు పూర్తి చేయాలి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటది. జర్నలిస్టులు, దివ్యాంగులకు రాయితీలు పునరుద్ధరించాలి’’అని రఘురామ్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు.  

మహబూబాబాద్​లో రైళ్లు ఆపాలి: ఎంపీ బలరామ్ నాయక్

మహబూబాబాద్​లో చాలా రైళ్లు ఆగడం లేవని మహబూబాబాద్ ఎంపీ బలరామ్ నాయక్ తెలిపారు. తిరుపతి, విశాఖవైపు వెళ్లే టైమ్​లో ఆగుతున్న రైళ్లు.. తిరుగు ప్రయాణంలో ఆగడం లేవన్నారు. ‘‘వైజాగ్ వెళ్లే గరీబ్ రథ్ రైలుకు హాల్టింగ్ ఇవ్వాలి. మహబూబాబాద్ స్టేషన్ నుంచి అటు విశాఖ, ఇటు సికింద్రాబాద్ వెళ్లే ప్రయాణికులు ఎక్కువ మంది ఉంటారు. వారి సౌకర్యార్థం ట్రైన్ ఆపాలి’’అని రైల్వే అధికారులను కోరారు. 

సమస్యల పరిష్కారానికి కృషి చేస్తం: రైల్వే జీఎం అరుణ్ కుమార్

తెలంగాణ, కర్నాటక రాష్ట్రాల ఎంపీలతో జరిగిన సమావేశంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ తెలిపారు. ‘‘ఎంపీల సూచనలు రైల్వే అభివృద్ధికి ఎంతో దోహదపడ్తది. రైల్వే సేవలు మరింత మెరుగుపరుస్తాం. తెలంగాణలో గడిచిన పదేండ్లలో 5 వందే భారత్ ఎక్స్​ప్రెస్​లతో సహా 67 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాం. 268 రోడ్ అండ్ బ్రిడ్జిలు, 40 రోడ్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మించాం. 29 రైల్వే స్టేషన్లలో 64 లిఫ్ట్​లు, 8 స్టేషన్లలో 27 ఎస్కలేటర్లు అందుబాటులో తెచ్చాం’’అని తెలిపారు. ఈ సమావేశంలో ఆదిలాబాద్ ఎంపీ గొడెం నగేశ్, మహబూబ్​నగర్ ఎంపీ డీకే అరుణ, మల్కాజ్​గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీదర్ ఎంపీ సాగర్ ఈశ్వర్, కలబురగి ఎంపీ రాధాకృష్ణ, రాజ్యసభ సభ్యుడు ఆర్.సురేశ్ రెడ్డి, రైల్వే అధికారులు పాల్గొన్నారు. 

రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయండి: ఎంపీ కడియం కావ్య

వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో నెలకొన్న సమస్యలపై రైల్వే అధికారులతో చర్చించానని వరంగల్ ఎంపీ డాక్టర్​ కడియం కావ్య చెప్పారు. ముఖ్యంగా వరంగల్​లో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు వంటి కీలక డిమాండ్​ను అధికారుల ముందు ఉంచినట్టు తెలిపారు. సమస్యలన్నింటినీ అధికారులు ఓపికగా విని పరిష్కారానికి హామీ ఇచ్చినట్లు తెలిపారు.