రూ.415 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి : కిషన్ రెడ్డి

రూ.415 కోట్లతో చర్లపల్లి టెర్మినల్ అభివృద్ధి : కిషన్ రెడ్డి
  • ఎయిర్​పోర్టు తరహాలో డెవలప్ చేస్తున్నం: కిషన్ రెడ్డి
  • ఎలక్ట్రిఫికేషన్ పనులు పూర్తవుతున్నయ్​
  • సికింద్రాబాద్ – గోవా రైలు ప్రారంభోత్సవంలో కేంద్ర మంత్రి వ్యాఖ్య

హైదరాబాద్/సికింద్రాబాద్, వెలుగు : ఎయిర్​పోర్టును తలపించేలా చర్లపల్లి రైల్వే టెర్మినల్​ను అభివృద్ధి చేస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.415 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలోనే ఈ టెర్మినల్​ను ప్రారంభిస్తామన్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గోవాకు బైవీక్లీ ట్రైన్​ను కిషన్ రెడ్డి ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

 ‘‘గోవాకు వెళ్దామనుకునేవాళ్లకు ఈ ట్రైన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పటికే గోవాకు వెళ్తున్న రైళ్లలో రిజర్వేషన్లు దొరక్క చాలా మంది ఇబ్బందిపడ్తున్నారు. బైవీక్లీ ట్రైన్​తో ఇబ్బందులు తగ్గుతాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్నాటక ప్రజలకూ ఎంతో సౌకర్యంగా ఉంటది. మూడు రాష్ట్రాల పరిధిలో పర్యాటక, వాణిజ్య, సాంస్కృతిక సంబంధాలు మరింత మెరుగుపడ్తాయి’’ అని కిషన్ రెడ్డి తెలిపారు.  బైవీక్లీ ట్రైన్.. బుధ, శుక్రవారాల్లో సికింద్రాబాద్ నుంచి బయలుదేరుతుందని, వాస్కోడగామా నుంచి గురు, శనివారాల్లో తిరుగు ప్రయాణం అవుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.

 ‘‘తెలంగాణలో గడిచిన పదేండ్లలో రైల్వేపరంగా ఎంతో అభివృద్ధి జరిగింది. కొత్త రైల్వే లైన్లు, ఎలక్ట్రిఫికేషన్, డబ్లింగ్, ట్రిప్లింగ్ పనులు పూర్తి కావొచ్చాయి. మిగిలిన చోట్ల పనులు స్పీడ్​గా కొనసాగుతున్నాయి. వందకు పైగా రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం కల్పించాం. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి స్టేషన్లను ఆధునికీకరిస్తున్నం. దేశవ్యాప్తంగా ఢిల్లీ తర్వాత ఎక్కువ వందేభారత్ రైళ్లు సికింద్రాబాద్ నుంచే బయలుదేరుతున్నాయి. రూ.521 కోట్లతో కాజీపేటలో రైల్వే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్​ను ఏర్పాటు చేస్తున్నం.

 రూ.4,109 కోట్ల అంచనా వ్యయంతో భద్రాచలం–మల్కాన్​గిరి మధ్య 173 కిలో మీటర్ల ప్రాజెక్టుకు ఆమోదముద్ర పడింది. హైదరాబాద్​– నాగ్​పూర్ మధ్య రూ.6,661 కోట్లతో జాతీయ రహదారుల అభివృద్ధి పనులు త్వరలోనే ప్రారంభం కానున్నాయి’’అని కిషన్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్, కార్పొరేటర్ కొంతం దీపిక, రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

టికెట్ ధరలు ఇవీ..

సికింద్రాబాద్ నుంచి ఉదయం 11.45 గంటలకు ట్రైన్ బయలుదేరి.. మరుసటి రోజు ఉదయం 7.20 గంటలకు వాస్కోడాగామాకు చేరుకుంటది. కాచిగూడ, షాద్​నగర్, జడ్చర్ల, మహబూబ్​నగర్, గద్వాల్, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్లారి, హోస్పేట, కొప్పల్, గడగ్​, హుబ్లీ, ధార్వాడ్, లోండా, క్యాసిల్ రాక్, కులెం, సాన్వోర్​డెమ్, మడ్​గావ్ జంక్షన్లలో ఆగుతూ వాస్కోడాగామాకు చేరుకుంటది. స్లీపర్ క్లాస్ అయితే రూ.440, థర్డ్ ఎకానమీకి రూ.1,100, ఏసీ త్రీటైర్​కు రూ.1,185, సెకండ్ ఏసీ రూ.1,700, ఫస్ట్ ఏసీ రూ.2,860 చెల్లించాల్సి ఉంటది. ట్రయల్​రన్​గా ఆదివారం ప్రారంభమైన ఈ రైల్లో చాలా మంది ప్రయాణికులు గోవా బయలుదేరి వెళ్లారు.