![రంగరాజన్‌పై దాడి దురదృష్టకరం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/union-minister-kishan-reddy-said-condemns-the-attack-on-priest-of-chilukuru-balaji-temple-sri-rangarajan_UDFh6yVC07.jpg)
- బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి
న్యూఢిల్లీ, వెలుగు: చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన అర్చకుడు శ్రీ రంగరాజన్‌పై జరిగిన దాడిని ఖండిస్తున్నట్టు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉన్నతస్థాయి పదవులను త్యజించి సనాతన ధర్మ పరిరక్షణకు రంగరాజన్ అంకితభావంతో సేవలు అందిస్తున్నారని చెప్పారు. భక్తులకు ఆధ్యాత్మిక మార్గదర్శనం కల్పిస్తూ ఉన్నతమైన ధార్మిక విలువలను పాటిస్తున్నారని చెప్పారు. అలాంటి గౌరవప్రదమైన అర్చక వృత్తిలో ఉన్న వ్యక్తిపై జరిగిన ఈ అమానుష దాడి దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కార్యాలయం ఒక ప్రకటన రిలీజ్ చేసింది.
ప్రజాస్వామ్యంలో ఇలాంటి దౌర్జన్యాలు, బెదిరింపులు, భౌతిక దాడులకు ఏ మాత్రం స్థానం లేదని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇది సనాతన ధర్మంపై జరిగిన దాడిగా భావించాలని చెప్పారు. యువతకు, విద్యార్థులకు ఆధ్యాత్మిక దిశానిర్దేశం చేస్తున్న శ్రీ రంగరాజన్.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే విషయంలో ముందువరుసలో ఉన్నారని వెల్లడించారు. రంగరాజన్‌పై జరిగిన దాడిని సమాజంలోని ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపునిచ్చారు.నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టడి చేయాలని కోరారు.