కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట.. అంకెల గారడి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట..  అంకెల గారడి : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • రుణమాఫీపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌వి తప్పుడు లెక్కలు: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ అంటేనే అబద్ధాల పుట్ట, అంకెల గారడీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రుణమాఫీపై సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి పొంతనలేని లెక్కలు చెబుతున్నారని, ఆయన చెప్పేవన్నీ అబద్ధాలేనని సోమవారం ఒక ప్రకటనలో మండిపడ్డారు. ఒకేసారి రైతు రుణాలన్నీ మాఫీ చేస్తామని వరంగల్ రైతు డిక్లరేషన్‌‌‌‌‌‌‌‌లో కాంగ్రెస్ ప్రకటించిందని, కానీ అధికారంలోకి వచ్చిన 224 రోజుల తర్వాత సగం మాత్రమే మాఫీ చేశారన్నారు.

అధికారంలోకి వచ్చిన 8 నెలల్లోనే రూ.31 వేల కోట్లు మాఫీ చేశామని ఆగస్టు 26న సీఎం రేవంత్ ఒక సభలో ప్రకటించారు. కానీ ఆదివారం ప్రధాని మోదీకి రాసిన లేఖలో రూ.17 వేల కోట్ల రుణమాఫీ జరిగిందని చెప్పారు. మరి మిగిలిన రూ.14 వేల కోట్లు ఎక్కడకు పోయాయి? మరో 16 లక్షల మందికి పైగా రైతులకు ఎందుకు ఇంకా రుణమాఫీ జరగలేదు? మీరిచ్చిన హామీ అమలు కోసం రైతులు ఎంత కాలం వేచి చూడాలి? ఇది కాంగ్రెస్ పార్టీ మోసాల జాబితాలో మరొకటి చేరింది’’అని పేర్కొన్నారు. 

రుణమాఫీపై మాట మార్చారు

మొదట్లో రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని ప్రకటించి, ఇప్పుడు మాట మార్చారని, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే రుణమాఫీ చేస్తామని చెబుతున్నారని కిషన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి విమర్శించారు. అసలు తెలంగాణలో పంట రుణాలు తీసుకున్న రైతులెంత మంది? రూ.2 లక్షల్లోపు రుణాలున్న వారు ఎంతమంది? రుణమాఫీ చేసింది ఎంతమందికి? అనే లెక్కలన్నీ రాష్ట్ర ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ చెప్పిన దాంట్లో మూడో వంతు మందికి కూడా రుణమాఫీ జరగలేదని గుర్తుచేశారు. బూటకపు హామీలిచ్చి, రాష్ట్రంలోని రైతులను కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు.