న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు తెలుగులో ఉండాలి: కిషన్ రెడ్డి

 న్యాయస్థానాల్లో  వాదనలు, తీర్పులు తెలుగులో ఉండాలి: కిషన్ రెడ్డి

 

  • కోర్టుల్లో మాతృభాష అమలు యోచనలో కేంద్రం: కిషన్​రెడ్డి 
  • మన భాషను మనమే విస్మరిస్తున్నం
  • తెలుగు మహాసభలో ముఖ్య ​అథితిగా పాల్గొన్న కేంద్ర మంత్రి 

హైదరాబాద్, వెలుగు: న్యాయస్థానాల్లో వాదనలు, తీర్పులు మాతృభాషలోనే ఉండాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌ హెచ్ఐసీసీలో జరుగుతున్న ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తెలుగు భాష కాకతీయుల కాలంలో పరిఢవిల్లిందని చెప్పారు. నిజాం కాలంలో అణచివేతకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుడు ఆంధ్ర మహాసభ వంటి సంస్థలు తెలుగు అమలు కోసం పోరాడాయన్నారు. యక్షగానం, బుర్రకథ, హరికథ, కేవలం తెలుగుకే పరిమితమని చెప్పారని, అవధానం తెలుగు లేదా సంస్కృతంలోనే చేయగలరని పేర్కొన్నారు. ఇంగ్లిష్ వాడటం తప్పుకాదని, అయితే తెలుగును విస్మరించడం తప్పు అన్నారు. ప్రాథమిక విద్యాభాసం తెలుగులోనే జరగాలని ఆకాంక్షించారు. తెలుగును కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని, ఆ ఉద్యమం మన ఇంటి నుంచే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు. తెలుగు భాష, సంప్రదాయాలు, కళలను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహిస్తూ ప్రపంచ తెలుగు సమాఖ్య 32 ఏండ్లుగా సేవలు అందించడం అభినందనీయమన్నారు. చాలామంది తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నారని, సోషల్ మీడియా, లెటర్లలో తెలుగు పదాలను కూడా ఇంగ్లీష్​లో రాస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంట్లో కూడా మనం మాట్లాడే భాషలో 30 శాతం మాత్రమే తెలుగులో మాట్లాడుతున్నామని తెలిపారు. అందుకే ఇప్పటి నుంచి తెలుగులోనే మాట్లాడుకుందాం’ అని ఆయన పిలుపునిచ్చారు.

మహిళలు రాజకీయాల్లోకి రావాలి: డీకే అరుణ.. 

మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన సమయం ఆసన్నమైందని ఎంపీ డీకే అరుణ పేర్కొన్నారు. ప్రపంచ తెలుగు సమాఖ్య మహాసభలు బ్రహ్మాండంగా కొనసాగిస్తున్నాయని చెప్పారు. తెలుగు మహాసభలు  మన సంస్కృతి, సంప్రదాయలు, ఆచారాలు, పద్ధతులు  దేశ, విదేశాల్లో పాటించేలా ఈ కార్యక్రమాలు  ముందుకు  తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. తామేం తక్కువ కాదు అని మహిళలు నిరూపించుకోవాలని సూచించారు.