గత సర్కారు నిర్లక్ష్యంతోనే ట్రిపుల్ ఆర్​ లేట్​ : కిషన్​ రెడ్డి

  • వీలైనంత త్వరగా వరంగల్​ఎయిర్​పోర్ట్​ నిర్మాణం
  •  సీఐఐ ఆధ్వర్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధిపై చర్చ
  • హాజరైన తెలంగాణ ఎంపీలు

న్యూఢిల్లీ, వెలుగు: రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్​) ఏర్పాటు గత బీఆర్ఎస్​ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ముందుకు సాగలేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యమైతే తానే డబ్బులు తెచ్చేవాడినని అన్నారు. ఇక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుకూలం కాదని 3 కమిటీలు సిఫారసు చేశాయని చెప్పారు. సాధ్యంకాదని చెప్పిన తర్వాత ప్రజల డబ్బు వృథా చేయకూడదనే ఆ నిర్ణయం తీసుకోలేదన్నారు. కేటీఆర్ స్వయంగా వచ్చి కేంద్రం బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీని పెట్టకపోతే.. తామే పెడతామని ప్రకటించారని, కానీ పెట్టలేకపోయారని అన్నారు.

గురువారం ఢిల్లీలో కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) ఆధ్వర్యంలో రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి పై చర్చ జరిగింది. ఈ సమావేశంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు గడ్డం వంశీకృష్ణ, మల్లు రవి, బలరాం నాయక్, రఘువీర్ రెడ్డి, బీఆర్ఎస్ ఎంపీలు పార్థసారథి రెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, సీఐఐ ప్రతినిధులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక రంగం సాధించాల్సిన ప్రగతి, ఆ దిశలో తీసుకోవాల్సిన చర్యలపై ఎంపీలు మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఎంపీలు వివరించారు.

ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్​ ప్రభుత్వం హయాంలో నేతలు ముఖాలు కూడా చేసుకోలేని పరిస్థితి ఉండేదని అన్నారు.  ఇప్పుడు కూడా అలాంటి స్థితే డెవలప్​ అవుతున్నదని చెప్పారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు ఉండాలని, ఎన్నికల తర్వాత రాష్ట్రాభివృద్ధి కోసమే పనిచేయాలని హితవు పలికారు. కాంగ్రెస్ నేతలు ‘గాడిద గుడ్డు’అంటూ మాట్లాడటం మంచిది కాదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏమిచ్చిందో లెక్కలతో సహా వివరించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. వీలైనంత త్వరగా వరంగల్ ఎయిర్​పోర్ట్​ నిర్మాణం చేపడతామని తెలిపారు. వరంగల్ టూరిజం, ఐటీ, ఎంటర్​టైన్​మెంట్​ అభివృద్ధి పై ఫోకస్ చేస్తున్నామని చెప్పారు.  

పాలమూరు ప్రాజెక్ట్​కు జాతీయ హోదా ఇవ్వాలి: మల్లురవి

రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి కోసం కేంద్రంతో కలిసి నడుస్తామని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి అన్నారు. కేంద్రంతో ఘర్షణ వాతావరణం లేకుండా పనిచేయాలని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన అనుమతుల కోసం ఎంపీలుగా తాము కృషి చేస్తామని తెలిపారు. అయితే, కేంద్రం తెలంగాణపై వివక్ష చూపిస్తే వెనక్కి తగ్గేది లేదని అన్నారు.  

మహబూబ్ నగర్ లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు కు కేంద్రం సహకరించాలని కోరారు. ఐఐఎం ఏర్పాటు చేస్తే తెలంగాణ యువతకు మేలు జరుగుతుందని చెప్పారు. పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్టు కు జాతీయ హోదా ఇవ్వాలని లేదా మరే రకంగానైనా నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులపై ఒక బుక్ తయారు చేయించామని, ఆ బుక్ ను బీజేపీ ఎంపీలకు ఇచ్చి వాటి సాధనకు  కృషి చేయాలని కోరుతామని చెప్పారు.