మైనింగ్​ రంగంలో మహిళలకు ప్రాధాన్యమిస్తం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

మైనింగ్​ రంగంలో మహిళలకు ప్రాధాన్యమిస్తం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
  • మైనింగ్ సెమినార్​లో కిషన్ రెడ్డి, సీతక్క

హైదరాబాద్, వెలుగు: మైనింగ్ రంగంలో మహిళలకు ప్రాధాన్యం కల్పించే దిశగా చర్యలు చేపడతామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. గురువారం బేగంపేట్​లో మైనింగ్​లో మహిళల పాత్ర అనే అంశంపై  జరిగిన కార్యక్రమానికి కిషన్ రెడ్డి, మంత్రి సీతక్క ముఖ్య​ అతిథులుగా హాజరయ్యారు. కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. పురుషాధిక్య పరిశ్రమల్లో మహిళలకు సమాన అవకాశాలను సృష్టించడానికి మరిన్ని చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు.

మైనింగ్​ రంగంలో మహిళల విలువైన సహకారాలను గుర్తిస్తున్నామని అన్నారు.  కేంద్ర మైనింగ్​ శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే మాట్లాడుతూ .. మైనింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో మహిళా నిపుణులకు అనుకూల వాతావరణాన్ని సృష్టించటానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. 

మరింత ప్రోత్సహించాలి: సీతక్క

తెలంగాణ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. గనుల తవ్వకం సహా అన్ని రంగాల్లో మహిళల సాధికారతకు ప్రభుత్వం కట్టుబడి ఉందని  తెలిపారు. దేశంలోని మైనింగ్ రంగంలో మహిళల పాత్ర 8 నుంచి 10%లోపే ఉందన్నారు. మైనింగ్ రంగంలో మహిళలను  మరింత ప్రోత్సహించాలన్నారు.

సమాన పనికి సమాన వేతనం కోసం మహిళలు పోరాటం చేస్తున్నారని తెలిపారు. సమాజ కట్టుబాట్ల వల్ల మహిళలు ముందడుగు వేయలేకపోతున్నారని, వారిని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. మహిళా సంక్షేమం కోసం కేంద్రం  ఎక్కువ బడ్జెట్ కేటాయించాలని కోరారు. మైనింగ్ రంగానికి విశేష సేవలందించిన 46 మంది నిపుణులను ఈ సందర్భంగా సత్కరించారు.

పరిశ్రమలను పురోగతిలో నడిపించినందుకు ఐబీఎం, టాటా, జీఎస్ఐ, అదానీ, వేదాంత వంటి ప్రముఖ సంస్థలతో పాటు 10కి పైగా ప్రైవేటు కంపెనీలు, ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌జీఓలు, పలు పీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌యూలకు చెందిన మహిళలను కూడా సన్మానించారు. యూపీ, గుజరాత్‌‌కు చెందిన మైనింగ్ విభాగాల మహిళా అధిపతులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.