కాంగ్రెస్, టీఆర్ఎస్ కుమ్మక్కు : కిషన్ రెడ్డి

బీజేపీ సపోర్టర్లకు స్కీంలు ఆపుతామని బెదిరింపులు: కిషన్ రెడ్డి

న్యూఢిల్లీ, వెలుగు : మునుగోడులో బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌‌ రెడ్డి తప్పకుండా గెలుస్తారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌‌రెడ్డి అన్నారు. బుధవారం ఢిల్లీలోని విజ్ఞాన్‌‌ భవన్‌‌ లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. టీఆర్ఎస్ మునుగోడు నియోజకవర్గంలోని ప్రజలను భయపెడుతోందని అన్నారు. బీజేపీ అభ్యర్థిని ఓడించేందుకు టీఆర్‌‌ఎస్, కాంగ్రెస్‌‌ పార్టీలు కుమ్మక్కై బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయని ఆయన ఆరోపించారు.  బీజేపీకి అనుకూలంగా ఉన్నవారికి రైతుబంధు, ఉచిత కరెంట్‌‌, ప్రభుత్వ పథకాలు ఇవ్వబోమంటూ బెదిరిస్తున్నారని విమర్శించారు.

‘‘మునుగోడులో టీఆర్ఎస్ కు ఓటేసినా, కాంగ్రెస్ కు ఓటు వేసినా ఒక్కటే. బీఆర్‌‌ఎస్సో, టీఆరెస్సో తెలీదు కానీ ఆ పార్టీ అధ్యక్షుడు గతంలో కాంగ్రెస్‌‌ పాలనలో కేంద్ర మంత్రిగా పని చేశారన్న విషయాన్ని ప్రజలు గుర్తుంచుకోవాలి. తెలంగాణలో అహంకార, కుటుంబ పాలన పోయి ప్రజాస్వామ్య పాలన రావాలని  ప్రజలు, మేధావులు, కవులు, కళాకారులు కోరుకుంటున్నరు. టీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వం ప్రజలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నది” అని కిషన్ పేర్కొన్నారు. గతంలో జరిగిన ఉప ఎన్నికల్లో  మెజారిటీ ప్రజలు టీఆర్‌‌ఎస్‌‌కు వ్యతిరేకంగా ఓటు వేశారని, మునుగోడులోనూ అదే జరుగుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. రాజకీయం కోసం అవాస్తవాలు, అబద్ధాలు చెప్పడంలో కేసీఆర్‌‌ కుటుంబం పెట్టింది పేరని విమర్శించారు. లిక్కర్‌‌ స్కాం విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు.