- కేంద్ర పథకాలతో ఒక్కో రైతుకు రూ.24 వేల లబ్ధి
- 75 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్లలో జరిగిందని వెల్లడి
- ఆమనగల్లులో బీజేపీ ఆఫీస్ ప్రారంభం
ఆమనగల్లు, వెలుగు: ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగిన ఇండియా.. 2047 నాటికి పూర్తిస్థాయి అభివృద్ధి చెందిన దేశంగా నిలుస్తుందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా ఆమనగల్లులో బీజేపీ ఆఫీస్‌ను ఆయన ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. అవినీతి, అరాచక, కుటుంబ పాలన సాగిస్తున్న బీఆర్ఎస్ను ఇంటికి సాగనంపాల్సిన సమయం వచ్చిందన్నారు. కేంద్ర ప్రభుత్వం జాతీయ రహదారుల అభివృద్ధికి అధిక ప్రాధాన్యతనిస్తోందన్నారు.
దేశంలో 75 ఏండ్లలో జరగని అభివృద్ధి తొమ్మిదేండ్ల మోడీ పాలనలో జరిగిందన్నారు. అందులో భాగంగానే రాష్ట్రంలో లక్షా 90 వేల కోట్ల రూపాయలతో హైవేలను అభివృద్ధి చేసినట్టు చెప్పారు. ట్రిపుల్ తలాక్ చట్టాన్ని రద్దుచేసి ముస్లిం మహిళలకు హక్కులు కల్పించి వారి ఆత్మ గౌరవాన్ని పెంచారన్నారు. 370 ఆర్టికల్ రద్దు చేసి సాధారణ వ్యక్తులు స్వేచ్ఛగా జీవించే హక్కు కల్పించారన్నారు. తీవ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌ను ప్రపంచంలో ఒంటరి దేశంగా నిలిపారన్నారు.
ఎరువులు, ఇతర సబ్సిడీల కోసం కేంద్రం లక్షా 90 వేల కోట్లు ఖర్చు చేస్తూ ఒక్కో రైతుకు ఏడాదికి రూ.24 వేలు లబ్ధి చేకూరుస్తున్నదన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు ఆచారి, నరసింహారెడ్డి, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.