- దేశంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికీ ఆ ప్రతిపాదన రాలే: కిషన్ రెడ్డి
మేడారం(ములుగు), వెలుగు: మేడారం జాతరకు జాతీయ హోదా ఇవ్వలేమని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. దేశంలో ఏ ఆధ్యాత్మిక కేంద్రానికి, ఆలయానికి , జాతరలకు జాతీయ హోదా ఇచ్చే ప్రతిపాదన ఇప్పటివరకు రాలేదని ఆయన తెలిపారు. వనదేవతలు సమ్మక్క, సారలమ్మ పేరిట ములుగులో జాతీయ గిరిజన యూనివర్సిటీకి ప్రధాని నరేంద్రమోదీ రూ.900 కోట్లు కేటాయించారని, వచ్చే విద్యా సంవత్సరం నుంచి తాత్కాలిక తరగతులు ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.
గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క, సారలమ్మలను కిషన్ రెడ్డి దర్శించుకున్నారు. రాష్ర్ట పంచాయతీరాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆయనకు స్వాగతం పలికారు. అమ్మవార్లకు ఆయన ఎత్తుబెల్లం (బంగారం) సమర్పించారు. అనంతరం సీతక్క, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మేడారం మహాజాతర సమ్మక్క, సారలమ్మ పేరిట ములుగులో జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందన్నారు.
ఇటీవల రూ.900 కోట్లు కేటాయించారని, అందుకు రాష్ర్ట ప్రభుత్వం 337 ఎకరాల భూమిని గిరిజన సంక్షేమ శాఖకు అప్పగించిందని చెప్పారు. వచ్చే లోక్ సభ ఎన్నికల తర్వాత జాతీయ గిరిజన వర్సిటీకి ప్రధానమంత్రి భూమిపూజ చేస్తారని చెప్పారు. సమ్మక్క, సారలమ్మల పేరిట యూనివర్సిటీ ఏర్పాటు కావడం ఇక్కడి ప్రజలకు గర్వకారణమని, రాష్ర్ట ప్రభుత్వంతో కలిసి మంత్రి సీతక్క ఆధ్వర్యంలో తాత్కాలిక తరగతుల కోసం ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. అతి త్వరలోనే నోటిఫికేషన్ ఇస్తామని, ప్రక్రియ పూర్తికాగానే తరగతులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ యూనివర్సిటీలో స్థానిక గిరిజనులకే ఎక్కువ సీట్లు కేటాయిస్తామని, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అధికారులు ఈ వర్సిటీ ఇన్చార్జిలుగా వ్యవహరిస్తారన్నారు.
ట్రైబల్ సర్క్యూట్ కు రూ.80 కోట్లు ఇచ్చాం
కొందరు మేడారానికి జాతీయ హోదా ఇవ్వాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, ఆధ్మాత్మిక కేంద్రాలు, కుంభమేళాలకు, జాతరలకు జాతీయ హోదా ఇచ్చే పద్ధతి దేశంలో ఎక్కడా లేదని కిషన్ రెడ్డి తెలిపారు. మేడారం వనదేవతల జాతర నిర్వహణ కోసం కేంద్ర ప్రభుత్వం తరఫున నిధులు కేటాయించామని, రూ.80 కోట్లతో టూరిజం శాఖ ద్వారా ట్రైబల్ సర్క్యూట్ పేరుతో నిధులు మంజూరు చేశామన్నారు.
మౌలిక వసతుల కల్పన కోసం అభివృద్ధి పనులు చేపట్టి రాష్ట్ర టూరిజం శాఖకు అప్పగించామని, ఈ ఏడాది రూ.3.14 కోట్ల నిధులను సమ్మక్క, సారలమ్మ జాతర నిర్వహణ కోసం తన శాఖ ద్వారా విడుదల చేశామని తెలిపారు. గతంలోనే మేడారంలో మౌలిక వసతులు కల్పించేందుకు రూ.19 కోట్లు ఇచ్చామన్నారు.
వరంగల్ ఎయిర్ పోర్టు కోసం గత ప్రభుత్వం భూమి ఇవ్వలే
ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఎయిర్పోర్టు నిర్మాణం కోసం భూమి ఇవ్వాలని గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎన్నిసార్లు లేఖ రాసినా పట్టించుకోలేదని కిషన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంతో మాట్లాడి ఎయిర్ పోర్టు నిర్మాణం కోసం కృషి చేస్తానన్నారు. వరంగల్ వెయ్యి స్తంభాల ఆలయ నిర్మాణం కూడా త్వరలోనే పూర్తవుతుందని పేర్కొన్నారు. కేంద్ర మంత్రి వెంట బీజేపీ హన్మకొండ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మ, రాష్ర్ట నాయకులు కొండేటి శ్రీధర్, ములుగు జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరికొండ బలరాం తదితరులు ఉన్నారు.