![బూత్ లెవెల్ నుంచే ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం : కిషన్ రెడ్డి](https://static.v6velugu.com/uploads/2025/02/union-minister-kishan-reddy-said-that-mlc-election-campaign-should-be-taken-up-from-booth-level_V7z0Yk8GfR.jpg)
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈనెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి బూత్ స్థాయి నుంచి ప్రచార కార్యక్రమం చేపట్టాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనికి అనుగుణంగా గురువారం అన్ని బూత్ లల్లో వర్క్ షాప్ లు నిర్వహించాలని పార్టీ కేడర్ కు సూచించారు. ఇదే విధానాన్ని మండల, జిల్లాల్లోనూ చేయాలని కోరారు. బుధవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో కరీంనగర్– -నిజామాబాద్ – -మెదక్- – ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలపై ముఖ్య నాయకులు, ఆయా జిల్లాల అధ్యక్షులు, జిల్లా ఇన్ చార్జీలు, అసెంబ్లీ ఇన్ చార్జీలతో కిషన్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రచారంపై అనుసరించాల్సిన వ్యూహం, ఓటర్ ను నేరుగా కలవడం, అభ్యర్థి నామినేషన్ పై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఈ నెల10 నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో జాతీయ నాయకులు పాల్గొంటారని, దీనికి అనుగుణంగా కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రత్యేక సభలు, సమావేశాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. బూత్ స్థాయిలో పార్టీ కార్యకర్తలు, నాయకులు కలిసి కలిసికట్టుగా పని విభజన చేసుకుని ప్రతి ఓటరును కలుసుకోవాలన్నారు. ఓట్లను మన వైపునకు మళ్లించడమే ముఖ్యమని సూచించారు.
కేంద్ర బడ్జెట్ లో రూ.12 లక్షల వరకు ట్యాక్స్ మినహాయింపు అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని చెప్పారు.ఆయా సెగ్మెంట్లలో ప్రతి బీజేపీ నాయకుడు సవాల్ గా తీసుకొని పనిచేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవాలని పిలుపునిచ్చారు. కాగా.. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్క కొమురయ్యకు, పట్టభద్రుల అభ్యర్థి అంజిరెడ్డి తరుఫున ఆయన కుమార్తె అశ్వితకు బీ ఫారాన్ని కిషన్ రెడ్డి అందజేశారు. మల్క కొమురయ్య గురువారం నామినేషన్ దాఖలు చేయనుండగా, అంజిరెడ్డి, సరోత్తంరెడ్డి శుక్రవారం నామినేషన్లు వేయనున్నారు.