చేతనైతే దర్యాప్తు చేయండి..లేదంటే సీబీఐకి ఇవ్వండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి

చేతనైతే దర్యాప్తు చేయండి..లేదంటే సీబీఐకి ఇవ్వండి: కేంద్రమంత్రి కిషన్రెడ్డి
  • ఫోన్ ట్యాపింగ్ కేసుపై రాష్ట్ర సర్కార్‌‌కు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సవాల్ 
  • ఎవరి హయాంలో నిందితులు విదేశాలకు పారిపోయారని ప్రశ్న 
  • విచారణ కోరిందే మేం.. మేమెందుకు అడ్డుకుంటాం..    
  • సీబీఐకి అప్పగిస్తే కేసును తేల్చేస్తామని వెల్లడి  

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ఫోన్​ట్యాపింగ్​కేసును సీబీఐకి అప్పగిస్తే తేల్చే బాధ్యత తమదని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ‘‘కాళేశ్వరం, ఓఆర్ఆర్, ఫోన్​ ట్యాపింగ్, విద్యుత్​కొనుగోళ్లు, భూముల ఆక్రమణలు, కుంగిన మేడిగడ్డ బ్యారేజీ మీద కేంద్రం విచారణ చేపట్టాలని అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ డిమాండ్​చేసింది. కానీ అధికారంలోకి వచ్చాక సీఎం రేవంత్ రెడ్డి మాట మార్చారు. 

వాటిపై చేతనైతే దర్యాప్తు చేసి దోషులను శిక్షించాలి. లేదంటే సీబీఐకి అప్పగించాలి” అని సవాల్ విసిరారు. మంగళవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడారు. ఫోన్​ట్యాపింగ్​కేసును సీబీఐకి అప్పగించాలని తామే కోరామని, అలాంటిది విచారణను తామెందుకు అడ్డుకుంటామని ఆయన ప్రశ్నించారు. నిందితులు ఎవరి హయాంలో విదేశాలకు పారిపోయారో చెప్పాలని నిలదీశారు. 

‘‘1996 నుంచి పోరాటం చేస్తుంటే బాంబు పేలుళ్ల నిందితులను అప్పగించేందుకు అమెరికా కోర్టు ఇప్పటికి అనుమతించింది. ఒక సీఎం స్థాయి వ్యక్తి పరిపాలనపై అవగాహన లేకుండా ఈ రకమైన మాటలతో నవ్వులపాలు కావొద్దు” అని రేవంత్‌ను ఉద్దేశించి అన్నారు. నీళ్ల వివాదాలపై రెండు రాష్ట్రాలు సమష్టిగా నిర్ణయం తీసుకుని, సమస్యను పరిష్కరించుకోవాలని సూచించారు. 

అడిగినంత యూరియా పంపించాం.. 

దేశంలో రైతులకు అండగా ఉన్నది కేవలం మోదీ ప్రభుత్వమేనని కిషన్ రెడ్డి అన్నారు. ‘‘సోమవారమే పీఎం కిసాన్​డబ్బులు రైతుల ఖాతాల్లో వేశాం. ఏటా మూడుసార్లు ఒక్కరోజు కూడా ఆలస్యం కాకుండా ప్రతి రైతు ఖాతాలో డబ్బులు జమ చేస్తున్నాం. దీనిద్వారా తెలంగాణలో 31 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రాష్ట్రంలో ఎరువుల కొరత ఉందని పేపర్లలో వచ్చిన వార్తలు చూశాను. 

దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడాను. నిజానికి రాష్ర్ట ప్రభుత్వం అడిగిన దాని కంటే ఎక్కువ కోటానే కేంద్రం విడుదల చేసింది. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంతమంది వ్యాపారులు కావాలనే కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో 9.5 లక్షల మెట్రిక్​ టన్నుల యూరియా అవసరమైతే, 10 లక్షల మెట్రిక్​టన్నులు పంపించాం” అని వెల్లడించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.