
- రాష్ట్రంలో మా ప్రభుత్వ ఏర్పాటుకు తొందర లేదు: కిషన్ రెడ్డి
- డీలిమిటేషన్ పై స్టాలిన్, రేవంత్ తప్పుడు ప్రచారాలు చేస్తున్నరని ఫైర్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుపై తమకు ఎలాంటి తొందర లేదని, సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ కూలిపోవాలని అనుకోవట్లేదని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. జమిలి ఎన్నికల విధానం వచ్చాక జరిగే తొలి ఎన్నికల్లోనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని ధీమా వ్యక్తం చేశారు. శనివారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు.
డీలిమిటేషన్ పై రేవంత్ రెడ్డి, తమిళనాడు సీఎం స్టాలిన్ బోగస్ మాటలు మాట్లాడుతున్నారని ఫైరయ్యారు. తెలంగాణలో ఒక్క పార్లమెంట్ సీటు కూడా తగ్గదన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న పనులు 95 శాతం పూర్తి అవుతున్నా, రాష్ర్ట ప్రభుత్వం భూమిని కేటాయించనందుకే నిర్మాణంలో జాప్యం జరుగుతోందని ఆరోపించారు. ఈ విషయంపై పలుమార్లు రాష్ర్ట ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు.
తెలంగాణలో త్వరలో 10 నేషనల్ హైవేలను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తారని చెప్పారు. రీజినల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టును తామే ముందుకు తీసుకుపోతున్నట్లు తెలిపారు. కేంద్రం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని.. సోనియా, రాహుల్, సీఎం రేవంత్ ఇచ్చిన హామీలతో తమకు సంబంధం లేదన్నారు. కోచ్ ఫ్యాక్టరీపై అసత్యాలు, అప్పులపై ఏడుపులు, హామీలపై దాటవేత, భాషపై అబద్ధాలు.. ఇదే ఈ పార్టీలు, నేతల అసలైన విధానమన్నారు.