బేగంపేట రైల్వేస్టేషన్ పనులు 90% పూర్తి : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి

బేగంపేట రైల్వేస్టేషన్ పనులు 90% పూర్తి : కేంద్రమంత్రి కిషన్​రెడ్డి
  • త్వరలోనే స్టేషన్​ను జాతికి అంకితం చేస్తం
  • పూర్తిగా మహిళా సిబ్బందితో స్టేషన్ ​నిర్వహిస్తం: కిషన్​రెడ్డి

హైదరాబాద్​సిటీ/తార్నాక, వెలుగు: బేగంపేట రైల్వే స్టేషన్​ఆధునికీకరణ పనులు 90 శాతం పూర్తయ్యాయని, స్టేషన్‌‌‌‌ను త్వరలో జాతికి అంకితం చేస్తామని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి తెలిపారు. శనివారం దక్షిణమధ్య రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్, రైల్వే అధికారులతో కలిసి బేగంపేట స్టేషన్​ను పరిశీలించారు. అమృత్​స్కీంలో భాగంగా రూ.38 కోట్లతో ఎయిర్​పోర్టు మాదిరిగా స్టేషన్​ను అప్​గ్రేడ్​చేస్తున్నామని చెప్పారు.

బేగంపేట స్టేషన్‌‌‌‌ను పూర్తిగా మహిళా సిబ్బందితో నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణకు రైల్వే బడ్జెట్‌‌‌‌లో రూ.5,337 కోట్లు కేటాయించినట్లు కిషన్​రెడ్డి తెలిపారు. త్వరలో సికింద్రాబాద్‌‌‌‌లో ‘కవచ్’ పరిశోధన సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. తెలంగాణలోని 40 రైల్వే స్టేషన్లను అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద పునరాభివృద్ధి చేస్తున్నామని, పనులు వేగంగా జరుగుతున్నాయని తెలిపారు.

బేగంపేట స్టేషన్‌‌‌‌ను పర్యావరణహిత, హరిత రైల్వే స్టేషన్‌‌‌‌గా అభివృద్ధి చేస్తున్నట్లు రైల్వే జీఎం అరుణ్​కుమార్​జైన్​పేర్కొన్నారు. పచ్చదనం కోసం నీటి రీసైక్లింగ్ ప్లాంట్‌‌‌‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే తార్నాక డివిజన్ శాంతినగర్, లాలాపేట్ లో నిర్మించిన కమ్యూనిటీ హాళ్లను కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి శనివారం రాత్రి ప్రారంభించారు. కాలనీ, బస్తీవాసులు వినియోగించుకోవాలని సూచించారు. మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.