- పదేండ్లలో రాష్ట్రాన్ని ఎంతో డెవలప్ చేశాం: కిషన్ రెడ్డి
- సెలవు తీసుకోకుండా ప్రజల కోసం పనిచేశా
- కేసీఆర్ నన్ను అనరాని మాటలు అన్నరు
- ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పారు
- రాష్ట్రంలో కేంద్రం చేసిన అభివృద్ధిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
హైదరాబాద్, వెలుగు: పదేండ్లలో తెలంగాణకు కేంద్రం రూ.10లక్షల కోట్లు ఇచ్చిందని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాల కోసం రూ.6.02లక్షల కోట్లు, పన్నుల రూపంలో రూ.2.03 లక్షల కోట్లు, వ్యవసాయ ఉత్పత్తుల సేకరణకు రూ.1.95 లక్షల కోట్లు ఇచ్చినట్టు తెలిపారు. లబ్ధిదారులకు వడ్డీ రాయితీ కింద రూ.7వేల కోట్లు అందజేశామని వివరించారు. సెలవు తీసుకోకుండా రాష్ట్ర ప్రజల కోసం పని చేశానని చెప్పారు. గురువారం హైదరాబాద్‌లోని పింగళి వెంకయ్య కన్వెన్షన్‌లో ‘ప్రజలకు నివేదిక’ కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు పదేండ్లలో ఏం ఇచ్చింది? ఎంపీగా రాష్ట్రానికి, సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో చేసిన డెవలప్మెంట్పై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడారు. ‘‘ఫ్యామిలీతో తిరుపతికి పోయినప్పుడు తప్పా.. ఏనాడూ నేను సెలవు తీసుకోలేదు. ప్రజలు, పార్టీ కోసం పని చేశా. కాంట్రాక్టులు దక్కించుకున్నట్టు, కబ్జాలు చేసినట్టు, పక్షపాతంతో వ్యవహరించినట్టు నాపైన ఎలాంటి ఆరోపణల్లేవు. ప్రజా సేవ చేశానని అనిపిస్తేనే నాకు మరోసారి ఓటేయండి” అని పేర్కొన్నారు.
రాష్ట్ర సమస్యలపై పోరాటాలు చేసిన
కేంద్ర మంత్రిగా రాష్ట్ర సమస్యలపై పోరాటం చేశానని కిషన్ రెడ్డి అన్నారు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై ఆయనకు ఎన్నో బహిరంగ లేఖలు రాశానని చెప్పారు. కానీ.. ఏ ఒక్కదానికి కూడా ఆయన సమాధానం ఇవ్వలేదన్నారు. ‘‘నేనొక కేంద్ర మంత్రిని.. నన్ను కేసీఆర్ అనరాని మాటలు అన్నరు. ప్రజలు ఆయనకు తగిన గుణపాఠమే చెప్పారు. నాకు కార్యకర్తల బలం ఉంది. వారందరి సహకారంతోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశా. కేంద్ర ప్రభుత్వం తెలంగాణలో 2,500 కిలో మీటర్ల నేషనల్ హైవేలు వేసింది.
హైదరాబాద్ సిటీకి రూ.48వేల కోట్లు ఇచ్చింది. ముద్ర యోజన, స్టాండ్ అప్ ఇండియా వంటి స్కీమ్‌ల ద్వారా అర్హులైన 26లక్షల మందికి రూ.38,013 కోట్ల రుణం ఇచ్చింది. రీజినల్ రింగ్ రోడ్డుకు రూ.26వేల కోట్లు, ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్‌కు రూ.627 కోట్లు, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ డెవలప్మెంట్ కోసం రూ.719 కోట్లు కేంద్రం ఇచ్చింది’’అని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. హైదరాబాద్ సిటీలో 236 బస్తీ దవాఖానాల ఏర్పాటుకు రూ.73 కోట్లు, ఐఐటీ హైదరాబాద్‌కు రూ.1,089 కోట్లు, సనత్‌నగర్ ఈఎస్ఐ మెడికల్ కాలేజీ, హాస్పిటల్ నిర్మాణం కోసం రూ.1,438 కోట్లు కేంద్రం ఇచ్చిందన్నారు.
సికింద్రాబాద్ సెగ్మెంట్‌ను డెవలప్ చేశ్న
ప్రతి ఏటా తెలంగాణ విమోచన ఉత్సవాలు నిర్వహించేందుకు ఉత్తర్వులు ఇప్పించానని కిషన్ రెడ్డి తెలిపారు. జీ20 సమావేశాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు తన చేతుల మీదుగా నిర్వహించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. ‘‘రామప్ప ఆలయానికి ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు తీసుకురావడంలో, ములుగులో సమ్మక్క సారక్క పేరుతో సెంట్రల్ వర్సిటీ తీసుకురావడంలో ఎంతో కృషి చేశా.
సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లోనూ కమ్యూనిటీ హాళ్లు, పవర్ బోర్‌వెల్స్, ఓపెన్ జిమ్స్, డిజిటల్ క్లాస్ రూములు, బెంచీలు, టాయ్‌లెట్ క్లీనింగ్ మెషీన్లు ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టా”అని వివరించారు. తర్వాత లోకసత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు అని, వాళ్లు కట్టిన పన్నుతోనే పిల్లల భవిష్యత్తును కాపాడే నిర్ణయాలు తీసుకోవాలన్నారు. అలాంటి ప్రభుత్వాన్నే ఎన్నుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ నర్సింహారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, బీజేపీ నేతలు కాసం వెంకటేశ్వర్లు, మర్రి శశిధర్ రెడ్డి, ప్రకాశ్‌రెడ్డి, చింతల రాంచంద్రారెడ్డి, రాణిరుద్రమ, శ్యామ్ సుందర్ గౌడ్, కృష్ణ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.