తెలంగాణలో వైద్య మౌలిక వసతుల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రూ.1,028 కోట్లతో హైదరాబాద్ సమీపంలోని బీబీ నగర్ వద్ద ఎయిమ్స్ ను నిర్మించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇందులో గతంలో ఉన్న నిర్మాణాలను 720 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి అనుగుణంగా అభివృద్ధి చేశామన్నారు. 30 పడకల ఆయుష్ హాస్పిటల్, ఎంబీబీఎస్, నర్సింగ్ విద్యార్థులకు అకాడమిక్ బ్లాక్, హాస్టల్స్, సిబ్బందికి క్వార్టర్స్, 650 మంది కూర్చునేలా ఆడిటోరియం, సమావేశ మందిరం నిర్మాణం, ఓపీడీ బ్లాక్ నిర్మాణాలను చేపట్టామని పేర్కొన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు తరగతులతో పాటు ప్రజలకు ఓపీడీ సేవలు కూడా ప్రారంభమయ్యాయని కిషన్ రెడ్డి చెప్పారు. ఈమేరకు బుధవారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.
సనత్ నగర్ లోని ఈఎస్ఐసీ ఆస్పత్రిలో కొత్త ఓపీడీ బ్లాక్ నిర్మాణం, అధునాతన వైద్య సదుపాయాల కల్పన కోసం రూ. 1,032 కోట్లను కేటాయించామన్నారు. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన పథకం కింద ఆదిలాబాద్ లోని రిమ్స్, వరంగల్ లోని కాకతీయ మెడికల్ కాలేజీలకు ఒక్కోదానికి రూ. 120 కోట్లు చొప్పున మొత్తం రూ.240 కోట్లు ఖర్చు చేసి నూతన బ్లాకుల నిర్మాణాలను చేపట్టామని కిషన్ రెడ్డి వివరించారు. ఇందులో భాగంగా 150 నుంచి 250 వరకు అదనపు పడకలను, కొత్త ఆపరేషన్ థియేటర్లను, 8 నుంచి 10 వరకు సూపర్ స్పెషాలిటీ విభాగాలను అందుబాటులోకి తెచ్చామని పేర్కొన్నారు. వీటికి తోడుగా దాదాపు 15 అదనపు పీజీ సీట్లను కేటాయించామని వివరించారు. రూ. 902 కోట్లతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద తెలంగాణవ్యాప్తంగా 4,549 హెల్త్, వెల్ నెస్ సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు.