తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్లమెంటు సీటు కూడా తగ్గదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

తెలంగాణ రాష్ట్రంలో ఒక్క పార్లమెంటు సీటు కూడా తగ్గదు : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  
  • 2009లో పునర్విభజన జరిగినట్టే ఇప్పుడు కూడా: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి  

హైదరాబాద్, వెలుగు: త్వరలో దేశవ్యాప్తంగా జనగణన జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి చెప్పారు. రానున్న జనరల్​ఎన్నికలకు ముందే మహిళల రిజర్వేషన్ల చట్టం అమలు చేయబోతున్నామని వెల్లడించారు. జనాభా లెక్కల సేకరణపై విపక్షాలు చేస్తున్నవి తప్పుడు ఆరోపణలేనని హోంమంత్రి అమిత్​షా కేంద్ర కేబినెట్​భేటీలో చెప్పారని గుర్తుచేశారు.

డీలిమిటేషన్​తో రాష్ట్రంలో ఒక్క ఎంపీ సీటు కూడా కూడా తగ్గే చాన్స్ లేదన్నారు. తెలంగాణలో 17కు 17, ఏపీలో 25కు 25 సీట్లు ఉంటాయని స్పష్టం చేశారు. 2009లో పునర్విభజన ఏ రకంగానైతే జరిగిందో అదే రకంగా పునర్విభజన జరిగేలా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. బీజేపీ స్టేట్ ఆఫీసులో మహిళా దినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు.

ఫ్రీ బస్ ఇచ్చిన రేవంత్.. అందులో తిరుగుతూ మిగిలిన హామీలు అమలు చేసినట్లు ఫీల్ అవ్వమని మహిళలకు చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మహిళలు పిడికిలి బిగించి రేవంత్ సర్కారును నిలదీయాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్ సర్కార్​లో.. గ్యారంటీల అమలు తక్కువ, ప్రచారం ఎక్కువ అని  ఎంపీ డీకే అరుణ ఎద్దేవా చేశారు. 

ఐఐటీహెచ్​తో బొగ్గు శాఖ ఒప్పందం 

కవాడిగూడలోని సీజీఐ టవర్స్ లో ఐఐటీ హైదరాబాద్ తో బొగ్గు, గనుల శాఖ ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీ హైదరాబాద్‌‌లో రూ.98 కోట్లతో సెంటర్ ఆఫ్ క్లీన్ కోల్ ఎనర్జీ అండ్ నెట్ జీరో పేరుతో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు కోల్​ఇండియా, ఐఐటీ హైదరాబాద్ మధ్య ఒప్పందాన్ని కిషన్ రెడ్డి సమక్షంలో కుదుర్చుకున్నారు.

అనంతరం కిషన్​రెడ్డి మాట్లాడుతూ.. సెంట్రల్ మైన్ ప్లానింగ్ అండ్ డిజైన్ ఇనిస్టిట్యూట్ లిమిటెడ్ కింద స్వతంత్ర ఆర్ అండ్ డీ వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆలోచన అన్నారు.