బీఆర్​ఎస్​ ఓ గురివింద గింజ..కేటీఆర్​ది మిడిమిడి జ్ఞానం

 

  • కాంగ్రెస్​ నుంచి గెలిచినోళ్లకు నాడు మంత్రి పదవులిచ్చిందే బీఆర్​ఎస్​
  • బీజేపీపై బురద చల్లాలని చూస్తున్నడు: కిషన్​రెడ్డి 
  • వార్తల్లో ఉండేందుకే కేటీఆర్​ ఏదో ఒకటి మాట్లాడ్తున్నడు
  • బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్​రెడ్డి మండిపాటు

న్యూఢిల్లీ, వెలుగు: గురివింద గింజ తరహాలో బీఆర్ఎస్ పార్టీ వ్యవహరిస్తున్నదని, ఆ పార్టీ నేతల తీరును చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్​ చీఫ్​ కిషన్ రెడ్డి అన్నారు. ‘‘బీఆర్ఎస్ నుంచి గెలిచిన వారిని కాంగ్రెస్ లోకి.. చేతి గుర్తుపై గెలిచిన వారిని గులాబీ పార్టీలోకి పంపించుకుని మంత్రి పదవులు తీసుకున్నప్పడు.. ఎవరు? ఎవరితో కలిసినట్లో.. కేటీఆర్ చెప్పగలరా? కేటీఆర్ మిడిమిడి జ్ఞానంతో మాట్లాడుతున్నడు” అని ఆయన మండిపడ్డారు. ట్విట్టర్ (ఎక్స్​)​ వేదికగా కేటీఆర్ చేసిన కామెంట్లకు గురువారం కిషన్​రెడ్డి ట్విట్టర్​ లోనే కౌంటర్​ ఇచ్చారు. తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నాయని ఆరోపించారు. ‘‘పదేండ్ల పాటు బీఆర్ఎస్ అనుసరించిన మోసపూరిత విధానాలనే.. కాంగ్రెస్ కాపీ కొట్టి ఏడాదిగా అనుసరిస్తున్నది. 

గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన కాళేశ్వరం, ఫోన్​ ట్యాపింగ్​ కుంభకోణాలు, కేసుల విషయంలో ఇప్పుడు పురోగతి లేకపోవడం.. ఎవరితో ఎవరు కలిసున్నారనేది చాటిచెప్తున్నది. మేం గిల్లినట్లు చేస్తం.. మీరు ఏడ్చినట్లు చేయండన్న తెరచాటు ఒప్పందంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సంయుక్తంగా పనిచేస్తున్నయ్​” అని విమర్శించారు. అలాంటి కేటీఆర్​ ఇప్పుడు బురద జల్లడం కోసం తమపై ఆరోపణలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.  ‘‘రైతులను మోసం చేయడంలో, నిరుద్యోగ యువతను నడిరోడ్డుపై నిలబెట్టడంలో, ప్రజల మధ్య విభేదాలు రెచ్చగొట్టడంలో, హిందూ సమాజాన్ని నిట్టనిలువునా చీల్చడంలో, కుటుంబ పాలనను ప్రోత్సహించడంలో.. అవినీతిని పెంచి పోషించడంలో.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఆలోచన ఒకటే.  ఆ రెండు పార్టీల పరిపాలనలో సారూప్యతను చూస్తే ఎవరు, ఎవరి చేతుల్లో ఉన్నారో అర్థమవుతుంది. ఎవరికి ఎవరు దోస్తులనేది తెలంగాణ సమాజానికి తెలుసు” అని తెలిపారు. బీజేపీ ఒక సిద్ధాంతం ఆధారంగా ఎదిగిన పార్టీ అని చెప్పారు. రాజకీయ అస్తిత్వాన్ని కోల్పోతున్న సందర్భంలో.. ఏదో ఒకటి మాట్లాడి వార్తల్లో ఉండాలనుకునే మనస్తత్వాలకు ప్రజలే సరైన బుద్ధి చెప్తారని కేటీఆర్ కు కిషన్​రెడ్డి కౌంటర్ ఇచ్చారు.