ఎన్నికలు వచ్చినప్పుడే కేసీఆర్కు ప్రజలు గుర్తుకొస్తరు: కిషన్ రెడ్డి

నల్గొండ: ఎన్నికలు వచ్చినప్పుడే సీఎం కేసీఆర్ కు ప్రజలు గుర్తుకొస్తారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో భాగంగా గురువారం కిషన్ రెడ్డి గుండ్లోరిగూడెంలో రాజగోపాల్ రెడ్డి తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్ ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. ఎన్నికలప్పుడు తప్ప మామూలు సందర్భాల్లో కేసీఆర్ ఫాంహౌజ్ నుంచి బయటకి రారని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం అప్పలపాలు అయ్యిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి ఎనిమిదేళ్లు దాటుతున్నా ప్రజలకు కేసీఆర్ చేసిందేమీ లేదని మండిపడ్డారు. రోడ్లు, జీపీ భవనాలు, ఇండ్లు, ఉద్యోగాలు లేక ప్రజలు ఇబ్బందిపడుతున్నారని తెలిపారు. మునుగోడు నియోజవర్గంలో మొత్తం ఎన్ని గ్రామాల్లో రోడ్లు, జీపీ భవనాలు నిర్మించారో సీఎం చెప్పాలని నిలదీశారు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటికీ ప్రజలు రోడ్లు అడుగుతున్నారంటే సీఎం కేసీఆర్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవాలని కోరారు. విద్యార్థుల ప్రాణ త్యాగాలతో ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యోగాలు లేక  యువకులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

కల్వకుంట్ల పాలన పోవాలంటే బీజేపీని గెలిపించండి

రాష్ట్రంలో  కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పాలన పోవాలంటే మునుగోడులో బీజేపీకి ఓటేయాలని మంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఆనాడు రజాకార్లను తరిమికొట్టినట్లే ఇవాళ టీఆర్ఎస్ ను తరిమి కొట్టాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. కాళేశ్వరం, మిషన్ భగీరథ వంటి పథకాలతో అవినీతికి పాల్పడి కేసీఆర్ కుటుంబం కోట్లకు పడగలెత్తిందని ఆరోపించారు. అక్రమంగా సంపాదించుకున్న డబ్బుతోనే కేసీఆర్ సొంత విమానం కొంటున్నారని చెప్పారు. కోట్ల కొద్దీ డబ్బు పంపిణీ చేస్తూ టీఆర్ఎస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరు డబ్బులిచ్చినా తీసుకోవాలని, ఓటు మాత్రం బీజేపీకే వేయాలని కోరారు. ప్రజల కోసమే రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని, ఆయన్ని గెలిపించాలని  మంత్రి కిషన్ రెడ్డి  విజ్జప్తి చేశారు.