పొలిటికల్​ లీడర్ల భాష మారాలి: కిషన్ రెడ్డి

పొలిటికల్​ లీడర్ల భాష మారాలి: కిషన్ రెడ్డి
  • రాజకీయాలంటే ప్రజలు అసహ్యించుకునేలా ఉండొద్దు: కిషన్​రెడ్డి
  • మతపరమైన ఉద్రిక్తతలు రేపే మాటలనూ నియంత్రించాలి: పొన్నం
  • నేతల భాష హద్దు దాటకుండా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలని సూచన

హైదరాబాద్, వెలుగు: పొలిటికల్​ లీడర్ల భాష మారాల్సిన అవసరం ఉన్నదని కేంద్రమంత్రి కిషన్​రెడ్డి పేర్కొన్నారు.  నేతలు ఒకరినొకరు విమర్శించుకునే విధానం చూసి, రాజకీయాలంటేనే ప్రజలు అసహ్యించుకునేలా ఉండొద్దని సూచించారు.  హైదరాబాద్​లోని నాంపల్లి ఎగ్జిబిషన్​గ్రౌండ్​లో ఆదివారం హర్యానా గవర్నర్​ బండారు దత్తాత్రేయ కుమార్తె విజయలక్ష్మి అధ్యక్షతన  ‘అలయ్​బలయ్’ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్​రెడ్డి, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్​మధ్య ఆసక్తికర చర్చ నడిచింది.  కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘మనం మాట్లాడే భాషలో మార్పు రావాల్సిన అవసరం ఉన్నది. ఎన్నికల సమయంలో ఏమైనా మాట్లాడుకోవచ్చు, విమర్శించుకోవచ్చు. ఆ తర్వాత ప్రజల  కోసం కృషి చేయాలి. కొన్నేండ్లుగా రాజకీయ పార్టీల మధ్య చెప్పుకోలేని భాషలో విమర్శలు కొనసాగుతున్నాయి. వారిలో మార్పు రావాలి.  ఆ భాష అంగీకారయోగ్యం కాదు” అని అన్నారు. దీంతో కేంద్ర మంత్రిని ఉద్దేశించి మంత్రి పొన్నం ప్రభాకర్ పలు కామెంట్స్​ చేశారు. భాష ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ఉండొద్దని చెప్పిన కిషన్ రెడ్డి మాటలు నిజమేనని అన్నారు. రాజకీయ నేతల భాషలు హద్దులు దాటకుండా ఉండేలా పార్టీలన్నీ నిర్ణయం తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో మతపరమైన ఉద్రిక్తతలు కలిగించే మాటలనూ నియంత్రించేందుకు ఈ ‘అలయ్ బలయ్’ ద్వారా కృషి చేయాలని బండారు దత్తాత్రేయను కోరారు.  

ప్రజల్లోకి మంచి సందేశం: మంత్రి శ్రీధర్​బాబు

భావితరాల రాజకీయ నాయకులు ఏవిధంగా ఉండాలో తెలిపేదే ‘అలయ్ బలయ్’ అని మంత్రి శ్రీధర్​బాబు అన్నారు. ఇలాంటి కార్యక్రమాలతో ప్రజల్లోకి మంచి సందేశం వెళ్తుందని చెప్పారు. పార్టీలకు అతీతంగా రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ కోరారు. ‘అలయ్ బలయ్’ తెలంగాణ సంప్రదాయానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డి పేర్కొన్నారు. ఎవరి మధ్య ఎన్ని విభేదాలున్నా.. అన్నీ పక్కనపెట్టి దసరా రోజు ‘అలయ్ బలయ్’ చేసుకుంటామని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.  ‘అలయ్ బలయ్’ అంటేనే దత్తాత్రేయ గుర్తుకు వస్తారని  సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేర్కొన్నారు. ఆంధ్రాలో కూడా ‘అలయ్ బలయ్’ నిర్వహించాలని కాంగ్రెస్ నేత వి.హనుమంతరావు అన్నారు. ఈ కార్యక్రమంలో  ఉత్తరాఖండ్ గవర్నర్ గుర్మిత్ సింగ్, మేఘాలయ గవర్నర్ విజయశంకర్, స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎంపీలు డీకే అరుణ, రఘునందన్, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ఏపీ మంత్రి సత్యకుమార్, మాజీ డిప్యూటీ సీఎం మహమూద్ అలీ,  విద్యాసాగర్ రావు, కోదండరాం, ఆర్. కృష్ణయ్య, వందేమాతరం శ్రీనివాస్, గోరటి వెంకన్న, రాకేశ్ రెడ్డి, ఎగ్గె మల్లేశం, సీఎస్ శాంతికుమారి, సినీనటుడు కోట శ్రీనివాస్ రావు పాల్గొన్నారు.  

తెలుగు రాష్ట్రాల సీఎంలు ఐక్యమత్యంతో పనిచేయాలి: దత్తాత్రేయ

తెలుగు రాష్ట్రాల సీఎంలు పరస్పరం ఐక్యమత్యంతో పనిచేయాలని,  రాష్ట్రాలను అన్ని రంగాల్లో మొదటి స్థానంలో నిలపాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ అన్నారు. తాము రాజకీయాలకు అతీతంగా ‘అలయ్ బలయ్’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హర్యానాకు తాను గవర్నర్ అయినా తెలంగాణ బిడ్డనే అని పేర్కొన్నారు. ‘అలయ్ బలయ్’ లో పలు చేతి వృత్తులను ప్రదర్శించామని, వాటిని కాపాడుకోవాలని కోరారు. ఈ కార్యక్రమానికి వస్తానని ఇచ్చిన మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని చెప్పారు. ఆయన ఆత్మవిశ్వాసంతో ఎదిగారని, జడ్పీటీసీ స్థాయి నుంచి సీఎంగా ఎదిగిన వ్యక్తి రేవంత్ అని దత్తాత్రేయ కొనియాడారు. 

సనాతనంలో మనం అనే పదానికే బలం: వెంకయ్యనాయుడు
    
బండారు దత్తాత్రేయ స్నేహశీలి అని, రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించే మంచి సంప్రదాయాన్ని నెలకొల్పారని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. అందరూ కలిసి బంధాలను, అనుబంధాలను పెంచుకోవడానికి అలయ్ బలయ్ వేదికగా నిలిచిందని ఆయన చెప్పారు. ఐక్యంగా ఉండడమంటే ఎదుటివారి ఆలోచనలను గౌరవించడమేనని అన్నారు. సనాతన ధర్మంలో నేను అనే పదానికి విలువలేదని, మనం అనే పదానికే బలం ఉందని చెప్పారు. దత్రాత్తేయ పేరు వినగానే హోలీ, ‘అలయ్ బలయ్’ కార్యక్రమాలు గుర్తొస్తాయని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్​ అన్నారు. అన్ని పార్టీల నేతలు ‘అలయ్​ బలయ్​’లో పాల్గొని, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే తరాల కోసం ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం గొప్ప విషయమని పేర్కొన్నారు. 

ఐక్యతకు వేదికగా అలయ్ ​బలయ్​’: గవర్నర్​

‘అలయ్ బలయ్’ గ్రామీణ సంస్కృతిని ప్రతిబింబిస్తున్నదని, ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎంతో ఎనర్జీ ఉండాలని చీఫ్ గెస్ట్​గా హాజరైన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ  అన్నారు. ఐక్యతకు వేదికగా ‘అలయ్ బలయ్’ ఉన్నదని, తెలంగాణ కల్చర్ ఎంతో అందంగా ఉందని కొనియాడారు. త్రిపురలో కూడా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తామని చెప్పారు.