మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదు : కిషన్ రెడ్డి

మేడారం జాతరపై కేంద్రానికి ఎలాంటి వివక్ష లేదన్నారు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. ఈ జాతరను  జాతీయ పండుగగా నిర్వహించాలని రాష్ట్ర నేతలు  అడుగుతున్నారని, కానీ.. జాతీయ పండుగ అనే విధానం ఎక్కడా లేదని స్పష్టం చేశారు.  మేడారానికి జాతీయ గుర్తింపు  తీసుకురావడానికి ప్రయత్నిస్తానని తెలిపారు. ఫిబ్రవరి 22వ తేదీ గురువారం రోజున  మేడారంలో సారలమ్మను దర్శించుకొని నిలువెత్తు బంగారం సమర్పించారు కిషన్ రెడ్డి.  

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ...  ప్రకృతి   వైపరీత్యాలు లేకుండా  పాడి పంటలతో దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లుగా తెలిపారు.   ములుగులో గిరిజన వర్సిటీ తాత్కాలిక క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తామని, ఈ ఏడాదే ప్రవేశాలకు అనుమతిస్తామని వెల్లడించారు. ఇందులో ఎక్కువ సీట్లుస్థానిక గిరిజన బిడ్డలకే  ఇస్తామన్నారు.  రూ. 900 కోట్ల తో సమ్మక్క సారక్క కేంద్రీయ  గిరిజన విశ్వవిద్యాలయాన్ని నిర్మిస్తున్నామని..  వర్సిటీ భవనాలకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని చెప్పారు.

రెండేండ్లకోసారి నాలుగురోజుల పాటు జరిగే మేడారం మహాజాతర బుధవారం ప్రారంభమైంది.  భక్తులు వరాలు పట్టంగ సారలమ్మ కన్నెపల్లి నుంచి కదిలొచ్చింది.  అమ్మను చూసేందుకు భక్తులు పోటీ పడ్డారు.  సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. మరోవైపు మహాజాతర మొదటిరోజైన బుధవారం సాయంత్రం 6 గంటల కల్లా 25 లక్షల మంది భక్తులు మేడారం చేరుకున్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. ఎటుచూసినా వనమంతా జనంతో నిండిపోయి కనిపిస్తున్నది. 

గురువారం సమ్మక్కను తోడ్కొచ్చే కీలక ఘట్టం ఆవిష్కృతం కానుంది. ప్రభుత్వ లాంఛనాల ప్రకారం గౌరవ సూచకంగా కాల్పులు జరిపి, సమ్మక్కకు ఎదుర్కోలు వేడుక నిర్వహిస్తారు. సమ్మక్క కొలువుదీరనున్న నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో జాతరలో భక్తుల సంఖ్య కోటికి చేరే అవకాశముందని అధికారులు చెప్తున్నారు.