సికింద్రాబాద్, వెలుగు: తార్నాక విజయపురికాలనీ నుంచి మల్కాజిగిరి వైపు వెళ్లే దారిని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెరిపించారు. గతంలో ఈ దారిని రైల్వే అధికారులు మూసివేయగా, స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీ ప్రజలు, నాయకులు సమస్యను కిషన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా ఆదివారం ఓపెన్ చేయించారు. అలాగే సికింద్రాబాద్ నియోజకవర్గంలోని తార్నాక, లాలాపేట, మెట్టుగూడ, పాతమెట్టుగూడ, రాంగోపాల్‌పేట రైల్వే అధికారులు, నాయకులతో కలిసి కిషన్‌రెడ్డి పర్యటించారు. మెట్టుగూడ నుంచి సీతాఫల్ మండి వైపు వెళ్లే దారిలో ఇరుకైన అండర్‌పాస్‌లతో ఇబ్బందిగా ఉందని స్థానికులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
Also Read : బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. నియోజకవర్గంలో ప్రజలు తన దృష్టికి తెచ్చిన రైల్వే సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించామని చెప్పారు. సమస్యల పరిష్కారానికి రైల్వే అధికారులకు పలు సూచనలు చేసినట్లు తెలిపారు. ప్రతిఒక్కరూ బాధ్యతగా ఉంటూ పరిసరాలను క్లీన్‌గా ఉంచుకోవాలని పిలుపునిచ్చారు. చాలా బస్తీల్లో నల్లా నీళ్లు కలుషితమై సరఫరా అవుతున్నాయని, స్ట్రీట్ లైట్లు వెలగడం లేదని, పార్కులు బాగోలేవని, పిల్లలు ఆడుకునేందుకు గ్రౌండ్స్ లేవన్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలన్నారు. సికింద్రాబాద్ రైల్వే డివిజనల్ మేనేజర్ ఏకే గుప్తా, మాజీ మేయర్ బండ కార్తీకారెడ్డి, కార్పొరేటర్లు చీరా సుచిత్ర, కొంతం దీపిక, బీజేపీ మహంకాళి జిల్లా నాయకులు శ్యాంసుందర్‌గౌడ్, సారంగపాణి, శారదామల్లేశ్, రాము పాల్గొన్నారు.