వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పర్యటన
నాలా, డ్రైనేజీలలో పూడిక తీయడం లేదు.. అలాగే పేరుకుపోయింది.. వెంటనే క్లియర్ చేయండి–కిషన్ రెడ్డి
హైదరాబాద్: వర్షాలు తగ్గినప్పటికీ ఇప్పటికీ తేరుకోని వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పర్యటించారు. అడిక్ మెట్ నాగమయ్య కుంటలో పర్యటించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బాధితులను ఆదుకుంటామని భరోసా కల్పించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా పలు సూచనలు ఇచ్చిన ఆయన అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. ఓపెన్ నాలా, డ్రైనేజీల కబ్జాలను ఎవరూ ప్రోత్సహించరాదన్నారు. నాలా, డ్రైనేజీలలో పూడిక తీయడం లేదని.. అలాగే పేరుకుపోయిందన్నారు. వెంటనే డ్రైనేజీలలో పూడిక తొలగించి మురికి నీరు వెంటనే వెళ్లిపోయేందుకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు.
వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించి నష్టంపై అంచనా వేసేందుకు హైదరాబాద్ వచ్చిన కేంద్ర బృందం.. ఉదయం దిల్ ఖుష్ గెస్ట్ హౌస్ లో హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి ని కలిసింది. వర్షాలు, వరద నష్టం పై కేంద్ర బృందంతో కిషన్ రెడ్డి కొద్దిసేపు చర్చించారు. అనంతరం అడిక్ మెట్ నాగమయ్య కుంటకు బయలు దేరారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. ఇప్పటికీ వాన నీరు పెద్ద ఎత్తున నిల్వ ఉన్న ప్రాంతాలను చూసి ఆయన ఆశ్చర్యపోయారు. పరిస్థితి ఇలాగే ఉంటే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేశారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. నాగమయ్య కుంటలో నివసిస్తున్న ప్రజలకు నివాస పట్టాలు ఉన్నాయి కాబట్టి వీరందరూ ఇండ్లు నిర్మించుకునేందుకు లోన్లు ఇప్పించమని అడుగుతున్నారు.. బ్యాంకర్లతో మాట్లాడి త్వరలోనే నాగమయ్య కుంట ప్రజలకు ఇండ్లు కట్టుకునేనందుకు బ్యాంకు లోన్లు ఇప్పిస్తామన్నారు. వర్షం నీళ్లు వెంటనే వెళ్లిపోయేలా డ్రైనేజీలను వెడల్పు చేయాలని సూచించారు. జీహెచ్ఎంసీ అధికారుల తో మాట్లాడి సమస్య ను పరిష్కారం చేస్తామన్నారు. సొంతంగా తమ జాగాలో ఇండ్లు నిర్మించుకునేందుకు 2 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.. రాష్ట్ర ప్రభుత్వం ఈ దరఖాస్తుల ను క్లియర్ చేయాలి.. నేను బ్యాంకులతో మాట్లాడి లోన్ లు ఇప్పిస్తానన్నారు. ఈ ఉదయం దిల్ కుషా గెస్ట్ హౌస్ లో కేంద్ర బృందం తో సమావేశం అయ్యాను.. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు కేంద్ర బృందానికి నష్టానికి సంబంధించిన నివేదికలు ఇంకా ఇవ్వలేదు.. వర్షాలు వరదలు నష్టంపై కేంద్ర బృందంతో చర్చించాను.. నష్టంపై పూర్తి స్థాయి రిపోర్ట్ సిద్ధం చేసి కేంద్రానికి అందిస్తామన్నారని కిషన్ రెడ్డి వివరించారు.