కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోవాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

కొండపోచమ్మ ప్రమాద బాధితులను ఆదుకోవాలి : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
  • మృతుల కుటుంబాలను పరామర్శించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

ముషీరాబాద్/పద్మారావునగర్, వెలుగు : కొండపోచమ్మ జలాశయంలో పడి చనిపోయిన అన్నదమ్ములు ధనుష్, లోహిత్ మృతికి ప్రభుత్వం బాధ్యత వహిస్తూ వారి కుటుంబానికి ఎక్స్​గ్రేషియా చెల్లించాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం ముషీరాబాద్ భోలక్​పూర్​డివిజన్ ఇంద్రా నగర్ లోని మృతుల ఇంటికి వెళ్లారు. తల్లిదండ్రులు నర్సింగ్ రావు, జ్యోతిని పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పి, ఆర్థిక పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. 

అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉన్న ఇద్దరు కొడుకులు మృతి చెందారని, సొంత ఇల్లు కూడా లేదని, ఉద్యోగం, ఇల్లు ఇప్పించాలని నర్సింగ్​రావు, జ్యోతి విజ్ఞప్తి చేశారు. అలాగే కొండపోచమ్మ సాగర్ లో మునిగి చనిపోయిన బన్సీలాల్​ పేట డివిజన్​సీసీ నగర్​కు చెందిన దినేశ్​కుటుంబ సభ్యులను  కిషన్​రెడ్డి పరామర్శించారు.