
నిజామాబాద్: తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడి ఎంపికపై కేంద్రమంత్రి, టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మాదిరిగా కాకుండా బీజేపీలో ఎవరైనా అధ్యక్షుడు కావచ్చని అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం (ఫిబ్రవరి 22) కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీదే గెలుపని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో పోటీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాయని ఎద్దేవా చేశారు. అలాగే.. కాంగ్రెస్ పాలనపై చర్చకు సిద్ధమన్న సీఎం రేవంత్ రెడ్డి సవాల్ పైన కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు.
Also Read :- కేసీఆర్,కేటీఆర్,హరీశ్.. జనాభా లెక్కల్లోనే లేరు
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలు నెరవేర్చాక.. కాంగ్రెస్ పాలనపై సీఎం రేవంత్ ఛాలెంజ్ విసిరితే బాగుండేదన్నారు. అన్ని రంగాల్లో రేవంత్ ప్రభుత్వం ఫెయిల్ అయిందని.. పాలనపై సీఎం రేవంత్ ఛాలెంజ్ విసరడం హాస్యాస్పదమని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రంలో ఏ వర్గం సంతోషంగా లేదని.. సీఎం రేవంత్ రెడ్డి అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. ఇక, ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాడ్యుయేట్ల, టీచర్లు ఆలోచించి ఓటేయాలని.. తెలంగాణ భవిష్యత్తుకు ఈ మండలి ఎన్నికలు దిశానిర్దేశం చేయనున్నాయన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత సంస్థాగత ఎన్నికల మీద దృష్టి పెడతామని క్లారిటీ ఇచ్చారు.