- అవసరమైన డెవలప్ మెంట్ చేసివ్వాలని సూచన
- ఎన్ని లేఖలు రాసినా ప్రభుత్వం స్పందించడం లేదని వెల్లడి
న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో ఆదిలాబాద్, జక్రాన్ పల్లి (నిజామాబాద్), వరంగల్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు సహకరించాలని సీఎం కేసీఆర్ ను కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కోరారు. ఈ మేరకు బుధవారం ఆయనకు బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎయిర్ పోర్టుల ఏర్పాటుకు అవసరమైన డెవలప్‌మెంట్ చేసి ఇవ్వాలని తాము కోరుతున్నా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని అందులో పేర్కొన్నారు. కేంద్ర సహకారాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఎయిర్ పోర్టు ఏర్పాటుకు ముందుకు రావాలని సూచించారు. ‘‘సామాన్యులకు సైతం విమాన ప్రయాణం అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో 2016లో ఉడాన్ స్కీమ్ తీసుకొచ్చాం. 2014లో దేశంలో 74 ఎయిర్ పోర్ట్ లు ఉంటే, ప్రస్తుతం వాటి సంఖ్య 140 దాటింది. 2026 నాటికి ఈ సంఖ్యను 220కి పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందులో భాగంగా తెలంగాణలో ఆదిలాబాద్, జక్రాన్‌పల్లి, వరంగల్ ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు ఆమోదం తెలిపినం. ఈ ఎయిర్ పోర్ట్ ల నిర్మాణం జరిగితే చిన్న, ప్రైవేటు విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుంటుంది” అని పేర్కొన్నారు.
రాష్ట్ర సర్కారు స్పందిస్తలే
తెలంగాణలో ఎయిర్ పోర్ట్ ల ఏర్పాటుకు సహకరించాలని కేసీఆర్ కు కేంద్ర విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింధియాతో సహా ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేక సార్లు లేఖలు రాసిందని కిషన్ రెడ్డి చెప్పారు. కానీ రాష్ట్ర సర్కార్ మాత్రం స్పందించడం లేదన్నారు. చివరకు ఇదే అంశంపై గతేడాది జులై లో కేసీఆర్ కు లేఖ రాసిన స్పందన రాకపోవడం దురదృష్టకరమన్నారు. ‘‘కేంద్ర మంత్రులు రాసిన లేఖలకు రాష్ట్ర సర్కార్ రిప్లై ఇవ్వడం లేదు. కానీ ఆ పార్టీ ఎంపీలు మాత్రం ఎయిర్ పోర్టులపై పార్లమెంటులో కేంద్రాన్ని ప్రశ్నలు అడగడం హాస్యాస్పదంగా ఉంది. ఇప్పటికైనా ఎయిర్ పోర్ట్ ల నిర్మాణంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే మంచిది. ఇందుకు అన్ని విధాలుగా సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉంది” అని చెప్పారు.