మేం కాదు.. మొత్తం మీ వల్లే.. సీఎంకు సిద్ధరామయ్యకు కుమారస్వామి కౌంటర్

మేం కాదు.. మొత్తం మీ వల్లే.. సీఎంకు సిద్ధరామయ్యకు కుమారస్వామి కౌంటర్

బెంగుళూర్: మైసూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (ముడా) భూముల ఇష్యూలోకి తన భార్య పేరును లాగారని కర్నాటక సీఎం సిద్ధరామయ్య ప్రతిపక్ష బీజేపీ, జేడీఎస్ పార్టీలపై ఫైర్ అయ్యారు. ఈ క్రమంలో సీఎం సిద్ధరామయ్య కామెంట్స్‎కు జేడీఎస్ అధినేత, కేంద్రమంత్రి కుమారస్వామి కౌంటర్ ఇచ్చారు. ఇవాళ (అక్టోబర్ 6) కుమారస్వామి మీడియాతో మాట్లాడుతూ.. మీ భార్యను ముడా కేసులోకి లాగుతున్నారని ప్రతిపక్షాలను ఆరోపిస్తున్నారు.. కానీ ఇంట్లో గౌరవంగా ఉన్న ఆమెను బయటకు తీసుకొచ్చింది మీరేనని సిద్ధరామయ్యపై ధ్వజమెత్తారు. ముడా స్కామ్‎లో సిద్ధరామయ్య భార్య పేరు తెరపైకి రావడానికి పూర్తి కారణం ఆయనేనని.. మీరు చేసిన తప్పును ప్రతిపక్షాలపై రుద్దుతున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Also Read :- 150 యేండ్ల నాటి MIT క్వశ్చన్ పేపర్.. సాల్వ్ చేయగలరా?

ముడా కుంభకోణంపై తన భార్యను టార్గెట్ చేసినందుకు ప్రతిపక్షాలను క్షమిస్తారా అన్న సీఎం కామెంట్స్‎పై స్పందిస్తూ.. ప్రజలు మమ్మల్ని క్షమించాలా లేదా అంగీకరిస్తారా అనేది తర్వాత వారే నిర్ణయిస్తారని అన్నారు. ఇప్పటివరకు కాంగ్రెస్ ప్రభుత్వం సాధించిన విజయాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలపై చర్చకు సిద్ధమా అని సిద్ధరామయ్యకు సవాల్ విసిరారు. కాగా, ముడా భూకుంభకోణం ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్యతో పాటు ఆయన సతీమణితో పాటు మరికొందరిపై కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ముడా స్కామ్ లోకి ప్రతిపక్షాలు తన భార్య పేరును లాగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.