విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ ప్రసక్తే లేదు: కేంద్రమంత్రి కుమార స్వామి

విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణపై కేంద్ర ఉక్కు పరిశ్రమల శాఖ మంత్రి కుమార స్వామి కీలక ప్రకటన చేశారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌‎ను ప్రైవేటీకరణ చేసే  ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. పీకల్లోతూ నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్ ప్లాంట్‎కు కేంద్ర ప్రభుత్వం రూ.11,500 కోట్ల భారీ ప్యాకేజీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమార స్వామి ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. నష్టాల్లో కూరుకుపోయిన విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను సవాలుగా తీసుకున్నామని తెలిపారు. 

ప్లాంట్‌ను మళ్లీ లాభాల బాట పట్టించి దేశంలో నెంబర్‌-1గా నిలబెట్టడమే మా లక్ష్యమని స్పష్టం చేశారు.  విశాఖ స్టీల్ ప్లాంట్‎పై మొత్తం రూ.35 వేల కోట్ల రుణభారం ఉందని తెలిపిన కేంద్ర మంత్రి.. విడతల వారీగా కేంద్ర ఆదుకుంటుందని తెలిపారు. కేబినెట్‌ నిర్ణయం ప్రకారం ఇది మొదటి ప్యాకేజ్‌ అని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కి ఒడిశాలో సొంత గనులున్నాయని.. కానీ అక్కడ ఇంకా మైనింగ్ మొదలు కాలేదని చెప్పారు. ప్లాంట్ ను పూర్తిగా పునరుద్ధరించిన తర్వాత సెయిల్ లో విలీనం చేయడంపై నిర్ణయం తీసుకుంటామని క్లారిటీ ఇచ్చారు. 

ALSO READ | విశాఖ ఉక్కుకు మోదీ ప్రాణం పోశారు.. ఈ రోజు చారిత్రాత్మకమైన రోజు

కాగా, విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిన విషయం తెలిసిందే. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబిటెట్ నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న ప్రతిపాదనకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. విశాఖ స్టీల్ ప్లాంట్‎కు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ ఉపసంఘం ఇటీవలే సిఫారసు చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన అధికారిక నిర్ణయం కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ కార్యాలయం నుంచి శుక్రవారం (17 జనవరి) అధికారిక ప్రకటన వెలువడింది.