సూర్యాపేట, వెలుగు: సీబీఐపై నమ్మకంతోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు సీబీఐకి అప్పగించిందని కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి మహేంద్ర నాథ్ పాండే స్పష్టం చేశారు. కేసు సిట్ నుంచి సీబీఐకి బదిలీ కావడం వెనుక ఆంతర్యం ఏమీ లేదని ఆయన అన్నారు. రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం సూర్యాపేట జిల్లాకు చేరుకున్న ఆయన.. బుధవారం సూర్యాపేటలో బీజేపీ నల్లగొండ ఎంపీ నియోజకవర్గ శక్తి కేంద్రాల ఇన్చార్జీలతో జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఈడీ, సీబీఐలు వస్తే కేసీఆర్ కు ఎందుకు భయమని ప్రశ్నించారు. కేంద్ర సంస్థల పేరు వింటే కేసీఆర్ కాళ్ల కింద భూమి కదులుతోందని, ఎలాంటి అవినీతి చేయకపోతే ఎందుకు కలవరపాటని నిలదీశారు.నల్లగొండ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో పార్టీని బలో పేతం చేయడం, కేసీఆర్ ప్రభుత్వ అవినీతిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ పార్టీ లక్ష్యమని ఆయన చెప్పారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం రాష్ట్రాలపై ప్ర యోగిస్తున్నారన్న ఆరోపణల్లో వాస్తవం లేదని, దేశంలో ఎక్క డ అవినీతి జరిగినా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయన్నారు. కొంతమంది నేతలు తమ స్వార్థ ప్రయోజనాల కోసం భారీగా అవినీతికి పాల్పడుతున్నారని, అలాంటి వారి పనిపట్టడమే దర్యాప్తు సంస్థల పని అని గుర్తుచేశారు.
కేంద్ర నిధులను కేసీఆర్ పక్కదారి పట్టిస్తున్నడు
నల్లగొండ పార్లమెంట్ పరిధిలో అభివృద్ధి , సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు విడుదల చేసిందని మహేంద్రనాథ్ పాండే తెలిపారు. పలు పథకాల కింద కేంద్రం నుంచి అధిక నిధులు వచ్చాయన్నారు. రాష్ట్రాల అభివృద్ధికి కేంద్రం నిధులు ఇస్తుంటే కేసీఆర్, మమత బెనర్జీ లాంటి వారు వాటిని పక్కదారి పట్టించి పేదలకు ద్రోహం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో పేదలకు సంక్షేమ పథకాలు అందడం లేదని, కనీసం పేదలకు ఇండ్లు కావాలన్నా దొరక్క ఏకంగా ప్రధానికే అర్జీ పెట్టుకుంటున్నారని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం 60 % నిధులు ఇస్తుంటే వాటిని కేసీఆర్ పక్కదారి పట్టించడంతో అభివృద్ధి జరగడం లేదని ఫైరయ్యారు. ఇక పంచాయతీలకు ఇచ్చిన నిధులు పక్కదారి పట్టడంతో ఏకంగా 18 మంది బీఆర్ఎస్ సర్పంచులు రాజీనామా చేశారని, కేసీఆర్ ప్రభుత్వ అవినీతికి ఇదే నిదర్శనమన్నారు. స్థానిక మంత్రి జగదీశ్ రెడ్డి.. ధాన్యం కొనుగోళ్లలో రూ.1150 కోట్ల అవినీతికి పాల్పడ్డారని, బీజేపీ అధికారంలోకి రాగానే ధాన్యం కొనుగోళ్ల అక్రమాలను వెలికితీస్తామని చెప్పారు. తర్వాత ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో కొత్తగా ఓటరుగా నమోదైన స్టూడెంట్స్తో మాట్లాడారు. ఓటుహక్కుపై అవగాహన కల్పించారు. మంత్రి వెంట బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు భాగ్యరెడ్డి ఉన్నారు.