
న్యూఢిల్లీ: భారత కెప్టెన్, స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మపై వివాదస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మహ్మమద్, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్‌పై కేంద్ర క్రీడా శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ నిప్పులు చెరిగారు. షామా, సౌగత్ రాయ్ వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ.. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను బాడీ షేమ్ చేయడం దారుణమని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని మండిపడ్డారు. క్రీడాకారులను రాజకీయాల్లోకి లాగొద్దని చురకలంటించారు.
‘‘క్రీడాకారులు తమ వృత్తిపరమైన జీవితాలను నిర్వహించుకోగల సామర్థ్యం కలిగి ఉన్నందున కాంగ్రెస్, టీఎంసీ వారిని ఒంటరిగా వదిలేయాలి. ఇటువంటి వ్యాఖ్యలు ప్రపంచ వేదికపై దేశానికి ప్రాతినిధ్యం వహిస్తోన్న మన క్రీడాకారుల కృషి, త్యాగాలను దెబ్బతీస్తాయి’’ అని పేర్కొన్నారు. రోహిత్ శర్మ భారత్‌కు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడని.. అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
అసలు షామా మహ్మమద్ ఏమన్నారు..?
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచులో కెప్టెన్ రోహిత్ శర్మ 17 బంతుల్లో 15 పరుగులు చేసి ఔటయ్యాడు. రోహిత్ శర్మ విఫలం కావడంతో కాంగ్రెస్ జాతీయ అధికార ప్రతినిధి షామా మొహ్మమద్ భారత కెప్టెన్‌పై వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అధిక బరువు ఉన్నారు.. అతడు బరువు తగ్గాల్సి ఉందని బాడీ షేమింగ్ కామెంట్స్ చేశారు షామా.
ALSO READ | రోహిత్ శర్మపై వివాదస్పద ట్వీట్.. కాంగ్రెస్ ఎంట్రీతో పోస్ట్ డిలీట్ చేసిన షామా మొహమ్మద్
అంతేకాకుండా.. భారతదేశం ఇప్పటివరకు కలిగి ఉన్న అత్యంత ఆకట్టుకోలేని కెప్టెన్ కూడా రోహిత్ శర్మనేనని షామా ట్వీట్ చేశారు. ఈ క్రమంలోనే రోహిత్ పై షామా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై అటు రోహిత్ ఫ్యాన్స్‌తో పాటు బీజేపీ నేతలు విరుచుకుపడ్డారు. రోహిత్ సారథ్యంలో భారత్ ఐసీసీ టీ20 వరల్డ్ కప్ సాధించిందని ఆమెకు కౌంటర్ ఇస్తున్నారు హిట్ మ్యాన్ ఫ్యాన్స్.
భారత జట్టులో రోహిత్ ఉండకూడదు: సౌగత రాయ్
టీఎంసీ సీనియర్ నేత, ఎంపీ సౌగత సౌగత రాయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలను సమర్థించిన సౌగత రాయ్.. ఆమె చేసిన కామెంట్స్ తప్పేమి కాదన్నారు. అధిక బరువుతో బాధపడుతోన్న రోహిత్ ఫిట్‌గా లేడని.. అతడు జట్టులో ఉండకూడదని వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. "దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. మాట్లాడేది క్రికెట్ గురించి. రెండేళ్లకు ఒకసారి సెంచరీ సాధించడం, ఇతర మ్యాచ్‌లలో త్వరగా అవుట్ కావడం వల్ల జట్టులో రోహిత్ శర్మ స్థానం దక్కదు. అతను జట్టులో కెప్టెన్‌గా ఉండకూడదు. రోహిత్ శర్మపై కాంగ్రెస్ నాయకురాలు షామా చేసిన వ్యాఖ్యలు సరైనవే. నిజంగానే రోహిత్ శర్మ అధిక బరువుతో ఉన్నాడు. కానీ ప్రజలు పట్టించుకోనట్లున్నారు" అని రాయ్ హాట్ కామెంట్స్ చేశారు.