ఇజ్రాయిల్, పాలస్తీనా మధ్య జరుగుతున్న యుద్ధ పరిణామాలను భారత ప్రధానమంత్రి కార్యాలయం నిశితంగా గమనిస్తోందని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి చెప్పారు. ఇజ్రాయిల్ దేశంలో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని చెప్పారు. ప్రధానమంత్రి, ఆయన కార్యాలయ సిబ్బంది అక్కడి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.
గతంలోనూ ఆంధ్రప్రదేశ్ సహా పలు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు విదేశాల్లో చిక్కుకుపోయిన ఘటనలు చోటు చేసుకున్నాయని కేంద్రమంత్రి మీనాక్షి లేఖి గుర్తు చేశారు. ఆ సమయంలో ఆపరేషన్ గంగ, వందేభారత్ వంటి పేర్లు పెట్టి ఆపరేషన్లు చేపట్టి ప్రతి ఒక్కరినీ సురక్షితంగా స్వదేశానికి చేర్చామని చెప్పారు.
ALSO READ : ఇజ్రాయిల్‌కు 12ఏళ్లుగా 'ఐరన్ డోమ్' రక్షణ.. నిజంగా ఇవాళ ఇది లేకుంటే..?
ప్రస్తుతం భారత ప్రభుత్వం, ప్రధాన మంత్రి కార్యాలయం ఇజ్రాయిల్‌లో చిక్కుకున్న విద్యార్థులతో నేరుగా టచ్‌లో ఉండి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటోందన్నారు. ఇజ్రాయిల్‌పై హమాస్ ఉగ్రవాదుల దాడి నేపథ్యంలో అక్కడి భారత రాయబార కార్యాలయం ఇదివరకే అడ్వైజరీ జారీ చేసింది. భారతీయ పౌరులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇజ్రాయిల్ దేశం సూచించే సలహాలను పాటించాలని కోరింది.