ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట

ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట

బెంగుళూర్: ఎలక్టోరల్ బాండ్ల కేసులో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‎కు భారీ ఊరట దక్కింది. ఈ కేసు విచారణపై కర్నాటక హై కోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, రాజకీయ పార్టీలకు విరాళాలు అందించే ఎలక్టోరల్ బాండ్ల స్కీమ్ లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‎,  బీజేపీ నేత నళిన్ కుమార్ కటీల్‎తో పాటు పలువురు బీజేపీ నేతలు, ఈడీ ఉన్నతాధికారులు అక్రమాలకు పాల్పడ్డారని జనాధికార సంఘర్ష సంఘటనే (జెఎస్‌పి)కి చెందిన ఆదర్శ్ అయ్యర్ బెంగుళూర్ ట్రయల్ కోర్టులో ఫిర్యాదు చేశారు. 

ALSO READ | మా ప్రపంచంలో ఉగ్రవాదానికి చోటు లేదు.. ప్రధాని మోడీ

నిర్మలా సీతారామన్ ఇతరులు ఎలక్టోరల్ బాండ్ల ముసుగులో దోపిడీ రాకెట్‌కు పాల్పడ్డారని ఆరోపించారు.  కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ ద్వారా పలు కార్పొరేట్ కంపెనీలను బెదిరించి వేల కోట్ల రూపాయిల ఎలక్టోరల్ బాండ్లు కొనుగోలు  చేయించి.. వాటిని జాతీయ మరియు రాష్ట్ర స్థాయిలలోని బీజేపీ నాయకులు నగదుగా మార్చుకున్నారని పిటిషన్‎లో పేర్కొన్నారు. ఆదర్శ్ అయ్యర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేయాలని ప్రత్యేక కోర్టు పోలీసులను ఆదేశించింది. ట్రయల్ కోర్టు ఆదేశాల మేరకు నిర్మలా సీతారామన్‌, నళిన్ కుమార్ కటిల్‎తో పాటు పలువురు బీజేపీ అగ్రనేతలతోపాటు ఈడీ ఉన్నతాధికారులపై బెంగళూరులోని తిలక్ నగర్‌ పోలీస్‌‌ స్టేషన్‌లో శనివారం (సెప్టెంబర్ 28) కేసు నమోదైంది. 

ఈ కేసును సవాల్ చేస్తూ నళిన్ కుమార్ కటీల్ కర్నాటక హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుపై విచారణపై స్టే విధించాలని ఆయన హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ ఎం నాగప్రసన్న విచారణ చేపట్టారు. నళిన్ కుమార్ అభ్యర్థన మేరకు ఎలక్టోరల్ బాండ్ల కేసు దర్యాప్తుపై స్టే విధిస్తూ  జస్టిస్ ఎం నాగప్రసన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. అనంతరం ఈ కేసు విచారణను అక్టోబర్ 23కు వాయిదా వేశారు. దీంతో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‎కు బిగ్ రిలీఫ్ లభించింది.