నాగ్ పూర్: కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అప్పుడప్పుడు తన సరదా వ్యాఖ్యలతో అందరినీ నవ్విస్తుంటారు. తాజాగా అలాంటి వ్యాఖ్యలు చేసి రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా లీడర్ రామ్ దాస్ అథవాలేను ఆటపట్టించారు. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తాము వరుసగా నాలుగోసారి కేంద్రంలోకి అధికారంలో వస్తామో రామో తెలీదు కానీ, రామ్‌దాస్ అథవాలే మాత్రం కచ్చితంగా మంత్రి అవుతారని గడ్కరీ వ్యాఖ్యానించారు.
నాగ్‌పూర్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో గడ్కరీ మాట్లాడారు. అయితే, తాను జోక్ చేస్తున్నానని ఆయన అన్నారు. దీంతో సభలో ఉన్నవారందరూ చిరునవ్వులు నవ్వారు. ఆ సమయంలో అథవా లే కూడా వేదికపైనే ఉన్నారు. ఆయన ఇప్పటికే మూడుసార్లు మంత్రిగా పనిచేశారు.
అనంతరం అథవాలే మాట్లాడుతూ.. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే మంత్రిపదవి దక్కించుకోవాలని ఆశిస్తున్నానని చెప్పారు. త్వరలో జరిగే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఆర్ పీఐ 10 నుంచి 12 స్థానాల్లో పోటీ చేయాలనుకుంటున్నదని ఆయన తెలిపారు.