ఖమ్మం, వెలుగు: జిల్లా ప్రజలకు నష్టం లేకుండా సమూల మార్పుతో పాపటపల్లి, మిర్యాలగూడ రైలు మార్గం అలైన్ మెంట్ మార్పునకు కేంద్ర రైల్వే మంత్రి ఓకే చెప్పారని ఎంపీ, జిల్లా అభివృద్ధి, సమన్వయ పర్యవేక్షణ (దిశ) కమిటీ చైర్మన్ నామా నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో దిశ కమిటీ మీటింగ్ జరిగింది. సమావేశంలో జాతీయ రహదారులు, పంచాయతీరాజ్, ఇరిగేషన్, విద్యుత్, మున్సిపల్, రైల్వే, డీఆర్డీఏ, వైద్య ఆరోగ్య, పరిశ్రమల శాఖల వారీగా కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై చైర్మన్ సమీక్షించారు.
ఈ సందర్భంగా నామా మాట్లాడుతూ మిర్యాలగూడ రైల్వే అలైన్ మెంట్ తో ఖమ్మం రూరల్, ముదిగొండ, నేలకొండపల్లి మండలాల్లోని 12 గ్రామాల ప్రజలు, చిన్న సన్నకారు రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. దీనిపై కేంద్ర రైల్వే మంత్రికి, రైల్వే బోర్డు చైర్మన్, జనరల్ మేనేజర్లతో తాను మాట్లాడిన ఫలితంగా, అలైన్ మెంట్ మార్చేందుకు అంగీకరించారని తెలిపారు. అయితే మళ్ళీ సర్వే చేసి, సామాన్య ప్రజలకు, రైతులకు ఇబ్బంది లేకుండా కొత్త రైలు మార్గాన్ని నిర్మించాలని కేంద్ర మంత్రిని కోరినట్లు నామా వివరించారు. వీలుంటే జిల్లాతో సంబంధం లేకుండా రైలు మార్గాన్ని నిర్మించే యోచన చేయాలని కోరారు.
రహదారుల కోసం రూ. 755 కోట్లతో ప్రతిపాదనలు
ఖమ్మం పార్లమెంట్ పరిధిలో అనధికార లే అవుట్లు, కాల్వల పూడ్చివేతపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇండ్లపై హైటెన్షన్ తీగలు, విద్యుత్ స్తంభాల తరలింపు, కావాల్సిన చోట విద్యుత్ స్తంభాల ఏర్పాటు, ట్రాన్స్ పార్మర్లల షిఫ్టింగ్ తదితర సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు. జాతీయ రహదారుల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలన్నారు. జిల్లాలో కొత్త రహదారుల కోసం రూ. 755 కోట్లతో ప్రతిపాదనలు పంపామన్నారు. దీనిపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. ఖమ్మం, కురవి జాతీయ రహదారి అభివృద్ధికి రూ. 124.80 కోట్లు మంజూరు అయినట్లు తెలిపారు.
రైల్వే అండర్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయండి
రాజ్యసభ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ వైద్య శాఖకు సంబంధించి ఎలాంటి అవసరాలు ఉన్నా తన దృష్టికి తేవాలని ప్రజాప్రతినిధులకు సూచించారు. జడ్పీ చైర్మన్ లింగాల కమలరాజ్ మాట్లాడుతూ, జిల్లాలో మధిర నియోజకవర్గంలో రైల్వే లైన్ ఎక్కువగా ఉందన్నారు. మధిర పట్టణంలో, పాతర్లపాడు, రాంపురం క్రాస్ రోడ్ మొదలగు చోట్ల రైల్వే అండర్ బ్రిడ్జిల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు కందాల ఉపేందర్ రెడ్డి, లావుడ్యా రాములు నాయక్, అదనపు కలెక్టర్లు స్నేహలత మొగిలి, మధుసూదన్ రావు, ఖమ్మం మునిసిపల్ కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ కలెక్టర్ మయాంక్ సింగ్, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.