- మీకు చేతకాకపోతే పరేడ్ గ్రౌండ్‌లో జరిపే వేడుకలకు రండి: బండి సంజయ్
కరీంనగర్, వెలుగు : తెలంగాణ ప్రజా పాలన ఉత్సవాలు దేని కోసమని, ఎవరికి భయపడి తెలంగాణ విమోచన దినోత్సవాన్ని నిర్వహించడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ప్రశ్నించారు. విమోచన దినోత్సవానికి పేరు మార్చి తెలంగాణ చరిత్రనే కనుమరుగు చేస్తున్నారని మండిపడ్డారు. నిజాంపై పోరాడి ప్రాణాలర్పించిన వారి త్యాగాలను అవమానిస్తున్నారన్నారు. సోమవారం కరీంనగర్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రజాపాలన పేరిట ఉత్సవాలు నిర్వహిస్తున్నందుకే తాను ప్రభుత్వ వేడుకలకు హాజరుకావడం లేదని, కాంగ్రెస్‌కు చేతనైతే తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో ఉత్సవాలు నిర్వహిస్తే తప్పకుండా హాజరవుతానని సంజయ్ స్పష్టం చేశారు.
విమోచనం పేరుతో మీకు ఉత్సవాలు నిర్వహించడం చేతకాకపోతే.. కేంద్రం అధికారికంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఉత్సవాలకు రావాలని సూచించారు. సర్దార్ వల్లభాయి పటేల్ ‘ఆపరేషన్ పోలో’పేరుతో చేసిన సాహసం వల్లే నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి కలిగిందని గుర్తుచేశారు. ఇంతటి మహత్తర ఘటనపై ఉత్సవాలు నిర్వహించుకునేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ ఊసరవెల్లి రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. రజాకార్ల దళం సృష్టించిన పార్టీయే ఎంఐఎం అని, ఆ పార్టీకి భయపడి, ఒక వర్గం ఓట్ల కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్‌లు విమోచన దినోత్సవం జరపకుండా ప్రజలను వంచిస్తున్నాయని మండిపడ్డారు.
సర్దార్ వల్లభాయి పటేల్ తమకు వీరుడేనని, తామంతా ఆయన వారసులేమన్నారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోక వస్తే హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయి పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సంజయ్ తెలిపారు. కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా ప్రకటనపై మాట్లాడుతూ.. ఇక్కడ ఖాళీగా ఉన్న కేసీఆర్ కుటుంబంలో ఎవరికో ఒకరికి ఢిల్లీ సీఎం పదవి ఇస్తారేమో అని ఎద్దేవా చేశారు. ఎందుకంటే ఇద్దరిదీ లిక్కర్ కేసే కదా అని పేర్కొన్నారు. ప్రధాని మోదీ పుట్టిన రోజు సందర్భంగా మంగళవారం పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ శ్రేణులకు సంజయ్ పిలుపునిచ్చారు.