- కరీంనగర్లోని ఉప్పల్ రైల్వే స్టేషన్ను అప్ గ్రేడ్ చేయండి
- రైల్వే మంత్రికి కేంద్ర మంత్రి బండి సంజయ్ విజ్ఞప్తి
న్యూఢిల్లీ, వెలుగు: కరీంనగర్–హసన్పర్తి కొత్త రైల్వే లేన్ ప్రాజెక్టుకు సంబంధించిన డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్ట్ సిద్ధమైనందున నిర్మాణ పనులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ రైల్వే శాఖను కోరారు. ఈ మేరకు మంగళవారం ఢిల్లీలో ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ కలిసి వినతిపత్రం అందజేశారు.
కరీంనగర్ నుంచి హసన్ పర్తి వరకు 61.8 కి.మీ.ల మేర నిర్మించే కొత్త రైల్వే లేన్ కు రూ.1,415 కోట్లు వ్యయం అవుతుందని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే బోర్డులో ఈ అంశం పెండింగ్లో ఉందని, తక్షణమే ఆమోదం తెలపాలని రిక్వెస్ట్ చేశారు. కొత్త రైల్వే లేన్ నిర్మాణం పూర్తయితే కరీంనగర్–వరంగల్ మధ్య వాణిజ్య కనెక్టివిటీ పెరిగి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
అలాగే, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు.అలాగే కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఉప్పల్ రైల్వే స్టేషన్ ను అప్ గ్రేడ్ చేయాలని కోరారు. ఇందులో భాగంగా ప్లాట్ ఫామ్, రైల్వే స్టేషన్ భవనాన్ని ఆధునీకరించాలని, కొత్త రైల్వే సేవలను ప్రవేశపెట్టాలని విజ్ఞప్తి చేశారు.