బీఆర్ఎస్​ను బ్యాన్ చేయాలి:బండిసంజయ్

బీఆర్ఎస్​ను బ్యాన్ చేయాలి:బండిసంజయ్
  • కేటీఆర్​ను అరెస్ట్​ చేయాల్సిందే: బండి సంజయ్​
  • ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం,ధరణి కేసులు ఎటుపోయినయ్?
  • అధికారులపై దాడులు చేయడం ఏంది? అని ఫైర్​

సంగారెడ్డి టౌన్, వెలుగు: అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారిన బీఆర్ఎస్ పార్టీని బ్యాన్ చేయాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ డిమాండ్​ చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ విధ్వంసానికి కారణం అవుతున్న బీఆర్ఎస్ ను పూర్తిగా రద్దు చేయాలని కోరారు. ఆదివారం సంగారెడ్డిలో  బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు. 

గత బీఆర్ఎస్ సర్కారు పాలనలో జరిగిన అనేక అవినీతి ఘటనల్లో కేటీఆర్ పేరు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చిందని అన్నారు. కాళేశ్వరం ఘటన, ఫార్ములా ఈ కారు రేసింగ్ లో 55 కోట్ల చెల్లింపులు, ధరణి, ఫోన్ ట్యాపింగ్, జన్వాడ ఫామ్ హౌస్, వికారాబాద్ జిల్లాలో కలెక్టర్ పై దాడి కుట్రలో కేటీఆర్ పేరు బహిర్గతమైనా ఎందుకు అరెస్టు చేయడం లేదని ప్రశ్నించారు. 

కేటీఆర్ కుటుంబం ఢిల్లీ పెద్దలకు ముడుపులు చెల్లించడం వల్లే అరెస్టు  చేయడం లేదని ఆరోపించారు. కేటీఆర్, రేవంత్ రెడ్డి కుటుంబాల మధ్య సత్సంబంధాలు ఉండడం వల్లే చర్యలు తీసుకోవడం లేదని అన్నారు. ఆ రెండు కుటుంబాల మధ్య ఉన్న అనుబంధాలను బహిర్గతం చేస్తానని సవాల్ విసిరారు. వికారాబాద్ ఘటనపై కలెక్టర్ నివేదిక ఆధారంగా ఎందుకు అరెస్టులు చేయడం లేదని ప్రశ్నించారు. 

అధికారులపై దాడులు చేయడం ఏంటని  ఫైర్​ అయ్యారు. మూసీ నది ప్రక్షాళనకు బీజేపీ వ్యతిరేకం కాదని, ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్లు దండుకోవాలని చూస్తున్న  ప్లాన్​ను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు.  ఫార్మా  పరిశ్రమ, మూసీ బాధితులకు తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. 

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి 

రైతులు  పండించిన ధాన్యాన్ని తేమ, తాలు పేరుతో కొర్రీలు పెట్టకుండా వేగంగా కొనుగోలు చేయాలని,   ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సన్న రకాలకు బోనస్ చెల్లించాలని  సంజయ్​ డిమాండ్ చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందన్న కారణంతోనే  కాంగ్రెస్ ప్రభుత్వం ధాన్యం సేకరణలో జాప్యం చేస్తున్నదని ఆరోపించారు.

ప్రైవేట్ వ్యాపారులకు లాభం చేకూర్చి,  వారి నుంచి కమీషన్లు పొందాలని  కుట్ర చేస్తున్నదని అన్నారు. రైతు భరోసా, రైతు కూలీలకు 12వేల చెల్లింపులు,  రైతు రుణమాఫీలో సర్కారు పూర్తిగా విఫలమైందని తెలిపారు.