- దేశవ్యాప్తంగా 500 మండలాలు యాస్పిరేషన్ బ్లాక్‌లుగా గుర్తింపు
- భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పర్యటన.. ఆఫీసర్లతో సమీక్ష
జయశంకర్ భూపాలపల్లి, ములుగు, వెంకటాపూర్(రామప్ప), వెలుగు: దేశంలో మారుమూల ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇందులో భాగంగానే వెనుకబడిన 500 మండలాలను యాస్పిరేషన్ బ్లాక్‌లుగా గుర్తించి అభివృద్ధి చేస్తోందని తెలిపారు. ఈ మేరకు సంపూర్ణత అభియాన్ కార్యక్రమంలో భాగంగా భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో చేపట్టిన పనులను పరిశీలించాలని ప్రధాని మోదీ ఆదేశిస్తే తాను ఇక్కడికి వచ్చానని ఆయన తెలిపారు.
సోమవారం భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ఆయన పర్యటించారు. ఇందులో భాగంగా రెండు జిల్లాల కలెక్టరేట్లలో ఆఫీసర్లతో సమీక్ష నిర్వహించారు. అలాగే, ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నందిపహాడ్, భూపాలపల్లి జిల్లా మహాముత్తారంలో పర్యటించి.. కేంద్రం అమలు చేస్తున్న అభివృద్ధి పనులను, యాస్పిరేషన్ పారా మీటర్లను పరిశీలించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, ఉద్యాన శాఖలు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.
ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం నంది పహాడ్ గొత్తికోయగూడెంలో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి చిన్నారులకు అన్న ప్రాసన, గర్భిణులకు సీమంతం, విద్యార్థులకు అక్షరాభ్యాసం కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లో 500 బ్లాక్ లలో సంపూర్ణత అభియాన్ కార్యక్రమం అమలవుతోందని సంజయ్ తెలిపారు. 2018లో భారతదేశం ఆర్థిక ప్రగతిలో 11వ స్థానంలో ఉండేదని, ప్రస్తుతం 5వ స్థానానికి చేరిందని, దానిని 2028 కల్లా మూడో స్థానానికి తీసుకురావాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు.
యాక్సిడెంట్లో మహిళను కాపాడిన బండి సంజయ్
హుజూరాబాద్ రూరల్, వెలుగు: కేంద్ర మంత్రి బండి సంజయ్ మానవత్వం చాటుకున్నారు. లారీ కింద ఇరుక్కొని ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఓ మహిళను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం కల్లెడ గ్రామానికి చెందిన మహిళ ప్రమాదవశాత్తు బైక్‌పైనుంచి పడి లారీ కింద ఇరుక్కుపోయింది. అదే సమయంలో ములుగు పర్యటనకు వెళ్తున్న సంజయ్.. లారీ వద్దకు వెళ్లి.. లారీ కింద టైర్ పక్కన రాడ్డులో జుట్టు చిక్కుకుని రక్తమోడుతున్న దివ్యశ్రీని చూసి భయపడొద్దు.. ధైర్యంగా ఉండాలని సూచించారు. అనంతరం స్థానికులు ఆ మహిళ జుట్టు కత్తిరించి బయటకు తీశారు. గాయాలపాలైన దివ్యశ్రీని సంజయ్ కరీంనగర్ లోని ఆస్పత్రికి తరలించారు.