![కులగణన ఓ బోగస్ సర్వే.. దీంట్లో లేని 60 లక్షల మందికి పైగా ప్రజలు ఏమైనట్లు?: బండి సంజయ్](https://static.v6velugu.com/uploads/2025/02/union-minister-of-state-for-home-bandi-sanjay-kumar-criticised-the-government-for-its-handling-of-the-survey_f8HFMvaWqC.jpg)
- దీంట్లో లేని 60 లక్షల మందికి పైగా ప్రజలు ఏమైనట్లు?: బండి సంజయ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ప్రభుత్వం నిర్వహించిన కులగణన సర్వే అంతా తప్పుల తడక అని, అది బోగస్ సర్వే అని కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కులగణన సర్వేలో 3.1 శాతం మంది పాల్గొనలేదని, వారి కోసం మళ్లీ రీ సర్వే చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం దుర్మార్గమని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం.. రాష్ట్రంలో 3. 35 కోట్లకుపైగా ఓటర్లున్నారని, ఓటు హక్కు లేని వారు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్ వరకూ సుమారు 60 లక్షల మంది ఉన్నారని వివరించారు. వీళ్లేకాక స్కూల్ కు పోని వాళ్లు, ఐదేండ్లలోపు పిల్లలు మరో 30 లక్షల మంది వరకూ ఉంటారని వివరించారు.
ఈ లెక్కన తెలంగాణ జనాభా 4.30 లక్షలు దాటుతుందని అన్నారు. రాష్ట్రంలో 3.95 కోట్ల ఆధార్ కార్డులు ఉండగా, కులగణన సర్వేలో మాత్రం 3.70 కోట్లకు జనాభాను కుదించడం బూటకమని మండిపడ్డారు. స్థానిక సంస్థలను ఎదుర్కొనే దమ్ములేక మళ్లీ 3.1 శాతం కుటుంబాలకు రీ సర్వే చేయాలనే సాకుతో హైడ్రామా చేయడం సిగ్గు చేటని అన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం కుల గణన విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించాలని, ఆధార్‌తో లింక్ చేసి, ప్రతి ఇంటికీ వెళ్లి రీ సర్వే చేయాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీ జాబితాలో చేర్చినా, బీసీ సామాజిక కులాల జనాభాను తగ్గించాలని చూసినా ఊరుకునే ప్రసక్తే లేదని హెచ్చరించారు.