ఆదివాసీల హీరో బిర్సా ముండా

ఆదివాసీల హీరో బిర్సా ముండా

గిరిజన, ఆదివాసీల హక్కుల కోసం బ్రిటీష్‌‌ వారితో పోరాడిన వారిలో భగవాన్ బిర్సా ముండా ముందు వరుసలో నిలుస్తారు. 25 ఏండ్లు మాత్రమే జీవించిన బిర్సా.. దేశ ప్రజల గుండెల్లో మాత్రం చిరస్థాయిగా చోటు దక్కించుకున్నారు. స్వాతంత్ర్యం కోసం, గిరిజన, ఆదివాసీల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, ఉద్యమాలు, తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు ఎంతోమందికి స్ఫూర్తినిస్తున్నాయి. గిరిజన ముండా కుటుంబంలో పుట్టిన బిర్సా.. అడవిలో ప్రశాంతంగా జీవించే గిరిజనులు, అనేక తెగలపై బ్రిటీష్ పాలకుల దారుణాలపై తిరగబడ్డారు. బ్రిటీషర్ల పాలనకు, వాళ్లు చేస్తున్న దారుణాలను తీవ్రంగా వ్యతిరేకించారు. గిరిజనులకు జరుగుతున్న అన్యాయాలను, ఆదివాసీల సంస్కృతికి జరుగుతున్న అవమానాలపై చైతన్యం కలిగించడంలో విజయం సాధించారు. ఉద్యమం చేస్తున్న క్రమంలో పోలీసులకు చిక్కి జైలులోనే చివరిశ్వాస విడిచారు.

పేద కుటుంబంలో పుట్టి..

ప్రస్తుత జార్ఖండ్‌‌లోని ఉలిహతు గ్రామంలో 1875వ సంవత్సరం నవంబర్‌‌‌‌ 15న గిరిజన ముండా కుటుంబంలో బిర్సా జన్మించారు. ఆయన బాల్యం అంతా పేదరికంలోనే గడిచింది. గిరిజనులు, అడవిలో జీవించే వారిపై బ్రిటీష్‌‌ పాలకులు చేసిన అన్యాయాలు, అరాచకాలను చూస్తూ పెరిగారు. దట్టమైన అటవీ ప్రాంతంలో, ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా జీవిస్తున్న గిరిజనుల జీవన శైలికి ఎలా అవరోధం కలిగిస్తున్నారు, వారిని దోచుకోవడానికి ఎలాంటి విధానాలను అవలంబిస్తున్నారనే విషయాలను నిశితంగా గమనిస్తూ పెరిగారు బిర్సా. అటవీ సంపదను, అక్కడ జీవించే వారిని కూడా దోచుకోవాలనుకున్న బ్రిటీష్ పాలకులు కొత్త విధానాలను ప్రవేశపెట్టడం ప్రారంభించారు. అందులో భాగంగానే ఛోటా నాగ్‌‌పూర్ ప్రాంతంలో ఫ్యూడల్ జమిందారీ విధానానికి నాంది పలికారు. వడ్డీ వ్యాపారులను, కాంట్రాక్టర్లను, భూస్వాములను అడవుల్లోకి తీసుకొచ్చారు. గిరిజనుల వ్యవసాయ వ్యవస్థ ‘ఖుంట్‌‌కట్టి’ని నాశనం చేశారు. మిషనరీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. ఆదివాసీల మత సాంస్కృతిక తత్వాన్ని అవమానించడం, వాళ్ల జీవన విధానంలో జోక్యం చేసుకోవడం వంటి అన్యాయాలు ఎక్కువయ్యాయి. వలస పాలకులు, ఆదివాసీల విరోధులైన డికులు (బయటి వ్యక్తులు) స్థానిక ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఎలా పనిచేస్తున్నారో బిర్సా తెలుసుకున్నారు. వీటన్నింటికీ వ్యతిరేకంగా పోరాడాలని అప్పుడే నిర్ణయించుకున్నారు. 

తీవ్రస్థాయికి దోపిడీ..
    
గిరిజన హక్కులను కాపాడాలని డిమాండ్ చేస్తూ అహింసా మార్గంలో బ్రిటీషర్లతో పోరాడుతున్న సర్దారీ లరాయ్‌‌ ఉద్యమాన్ని సాగిస్తున్న రోజులవి. అయితే అణచివేత ధోరణిలో ఉన్న బ్రిటీష్ పాలకులు ఆ ఉద్యమాన్ని పట్టించుకోలేదు. భూ యజమానుల స్థాయి నుంచి కూలీల స్థాయికి జమిందారీ వ్యవస్థ ఆదివాసీలను దిగజార్చింది. ఆదివాసీలతో వెట్టిచాకిరీ విధానానికి భూస్వామ్య వ్యవస్థ తెరలేపింది. పేద, అమాయక గిరిజనుల దోపిడీ తీవ్రస్థాయికి చేరింది. ఈ పరిస్థితులే ఆదివాసీల పక్షాన పోరాడడానికి బిర్సాను సమాయత్తం చేశాయనే చెప్పాలి. మతపరమైన విషయాలలో తోటి గిరిజనులకు బిర్సా కొత్త దారి చూపారు. వారి జీవన విధానాలను, సంస్కృతిని అవమానించే మిషనరీలకు ఎదురునిలిచారు. అదే సమయంలో మాత ఆచారాలను మెరుగుపరచడం, సంస్కరించడానికి ఆయన కృషి చేశారు. అనేక మూఢ ఆచారాలను వ్యతిరేకించారు. కొత్త సిద్ధాంతాలను పరిచయం చేశారు. గిరిజనుల ఆత్మాభిమానాన్ని, ఆదివాసీల వ్యవస్థను పునరుద్ధరించడానికి పోరాడారు. వారిలో చైతన్యం నింపడానికి ప్రయత్నించారు. అందులో భాగంగానే ‘పూర్వీకుల రాజుకు విజయం’ (సిర్మరేఫిరున్ రాజా జై) గురించి వివరించి ఆకట్టుకున్నారు. ఆదివాసీల భూమి వారి పూర్వీకుల నియంత్రణలో ఉంటుందని, అందువల్ల వారికి తమ భూమిపై సావరేనిటీ ఉంటుందని చెప్పారు. ఈ పరిణామాలతో ప్రజానాయకుడిగా ఎదిగారు. బిర్సాను.. భగవాన్‌‌గా, ధరతి ఆబాగా అనుచరులు భావించడం మొదలుపెట్టారు.

దోపిడీ వ్యవస్ధపై అవగాహన కల్పించారు

దోపిడీ దారులైన డికులతోపాటు, అణచివేతకు ప్రయత్నిస్తున్న బ్రిటీష్ ప్రభుత్వం తమ శతృవులని బిర్సా అర్ధం చేసుకున్నారు. బ్రిటీష్ పాలకుల వల్లే సమస్యలన్నీ వచ్చాయని, అవే తమ అణచివేతకు ముఖ్యమైన కారణమని స్పష్టంగా తెలుసుకున్నారు. స్వార్థ ప్రయోజనాల దోపిడీ వ్యవస్థ గురించి, దాని దౌర్జన్య స్వభావం గురించి గిరిజనులకు బిర్సా అవగాహన కల్పించారు. ‘రాణి రాజ్యం అంతమై, మన రాజ్యం స్థాపన కావాలి’ (అబువా రాజ్ సేతర్జన, మహారాణి రాజ్‌‌ తుండుజన) అనే ఉద్దేశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. భగవాన్ బిర్సా ముండా పిలుపునకు ముండాలు, ఒరాన్లు, ఇతర ఆదివాసీలు స్పందించారు. వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక విముక్తి కోసం వలసవాద యజమానులు, దోపిడీదారులకు వ్యతిరేకంగా పనిచేస్తున్న ‘ఉలుల్గన్‌‌’లో చేరారు. తిరుగుబాటు ఉద్యమం చేశారు.

పన్నులు కట్టొద్దని పిలుపు..

సుంకాలు, పన్నులు చెల్లించవద్దని బిర్సా ప్రజలకు పిలుపునిచ్చారు. భూస్వామ్య, మిషనరీ, బ్రిటీష్ వలస ప్రభుత్వ అధికార కేంద్రాలపై, అవుట్‌‌పోస్టులపైనా దాడులు చేశారు. సాంప్రదాయ విల్లులు, బాణాలతో బిర్సా నాయకత్వంలో తూర్పు దేశంలోని గిరిజనులు బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని సమర్ధవంతంగా నిర్వహించారు. ఈ చర్యల కారణంగా సామాన్య ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు కలగకుండా ఆయన చర్యలు తీసుకున్నారు. నిజమైన దోపిడీ దారులపైనే దాడులు జరిగేలా జాగ్రత్తలు చేపట్టారు. వీటన్నింటి కారణంగా ప్రజలు బిర్సా ముండాను తమ దైవ శక్తి స్వరూపంగా భావించారు. ఉద్యమం జరుగుతున్న క్రమంలోనే బిర్సా ముండా పోలీసులకు చిక్కి జైలుకు వెళ్లారు. 1900వ సంవత్సరం జూన్‌‌ 9న జైలులోనే ఆయన తుదిశ్వాస విడిచారు.

పోరాటం వృథా కాలే..

బిర్సా మరణించినా ఆయన చేసిన పోరాటం మాత్రం వృథా కాలేదు. బ్రిటీష్ పాలనలో గిరిజనుల దుస్ధితి, తమపై జరుగుతున్న దోపిడీని అరికట్టే దిశలో మార్పుకు బిర్సా చేసిన పోరాటం నాంది పలికింది. దీంతో ఆదివాసీల రక్షణ కోసం ‘ఛోటా నాగ్‌‌పూర్ టెనెన్సీ యాక్ట్‌‌ 1908’ను బ్రిటీష్ ప్రభుత్వం తీసుకొచ్చింది. గిరిజనుల భూమిని గిరిజనేతరులకు బదిలీ చేయడాన్ని ఈ చట్టం పరిమితం చేసింది. ఈ చట్టంతో గిరిజనులకు ఉపశమనం కలిగిందనే చెప్పాలి. వెట్టిచాకిరీ, నిర్భంధ పనిని రద్దు చేయడానికి కూడా చర్యలు తీసుకున్నారు.

ఇదే నిజమైన నివాళి..

మోడీ నాయకత్వంలో మొదటిసారి భగవాన్ బిర్సా ముండా జయంతి జరుపుకుంటున్నాం. బిర్సా జయంతి సందర్భంగా ప్రతి ఏడాది నవంబర్ 15న జన్‌‌ జాతీయ గౌరవ్ దివస్‌‌ జరుపుకోవడం గిరిజనుల ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ స్వతంత్ర పోరాటంలో  వారి సహకారాన్ని గుర్తిస్తూ ప్రభుత్వం నిజమైన నివాళిని అర్పిస్తోంది. జన్ జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా, సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి, భారతీయ సమాజ విలువలు, ఆతిథ్యం, జాతీయత పెంపొందించడానికి గిరిజనులు చేసిన కృషిని గుర్తుచేసుకుందాం.

మరణించి 121 ఏండ్లు గడుస్తున్నా..

మనదేశం ఆజాదీకా అమృత్ మహోత్సవ్‌‌ జరుపుకుంటున్న సందర్భం ఇది. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడుస్తున్న సమయంలో ప్రధాని మోడీ నేతృత్వంలో దేశం అభివృద్ధి దిశగా ముందడుగులు వేస్తోంది. ఈ సమయంలో స్వాతంత్ర్య ఉద్యమంతోపాటు అనేక పోరాటాలు చేసిన మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తిని ముందుతరాలకు తెలిసేలా చేయడం మన బాధ్యత. వారిని ఆదర్శంగా తీసుకోవాలి. 25 సంవత్సరాలే జీవించిన భగవాన్ బిర్సా ముండా మరణించి 121 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ కోట్లాది దేశప్రజలకు స్ఫూర్తినిస్తూనే ఉన్నారు. ధైర్యం, సాహసం, పరాక్రమం, నాయకత్వానికి బిర్సా ఉదాహరణ. గిరిజన సంస్కృతి, సంప్రదాయాలను పాటిస్తూనే అవసరమనుకున్న చోట తన మత విశ్వాసాలను, నమ్మకాలను సంస్కరించడానికి ఆయన వెనకడుగు వేయలేదు. స్వాతంత్ర్య ఉద్యమాన్ని ముండాలు, ఒరాన్లు, తామర్లు, కోల్లు, భిల్లులు, ఖాసీలు, కోయలు, మిజోస్టో వంటి అనేక గిరిజన తెగలు బలపరిచాయి. వారు చేసిన పోరాటాలు, త్యాగాలు, వారు చూపిన ధైర్యం చిరస్మరణీయమయ్యాయి. కారణాలు ఏమైనప్పటికీ దేశ స్వాతంత్ర్య పోరాటంలో వారిచ్చిన సహకారానికి చరిత్రకారులు సరైన న్యాయం చేయలేకపోయారనే చెప్పాలి. అయితే ప్రధాని మోడీ తన ఫిలాసఫీతో దేశ ప్రజలందరూ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ జరుపుకునే సందర్భంలో, బిర్సా ముండా వంటి కీర్తికి నోచుకోని వీరుల పరాక్రమాన్ని, త్యాగాలను ప్రజలందరికీ తెలిసేలా చేయాలని ప్రయత్నిస్తున్నారు. – డా. ఎల్.మురుగన్ (కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి)