కోదాడ,వెలుగు: పోరాడి సాధించుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ అన్నారు. బీజేపీ ప్రవాసీ యోజనలో భాగంగా ఆదివారం కోదాడ పట్టణంలోని పెరిక భవన్‌లో జరిగిన నియోజకవర్గ బూత్ ఇన్‌చార్జుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం 9 లక్షల కోట్లు మంజూరు చేసి చేసిందని వివరించారు.
అమరవీరుల త్యాగాలతో సాధించుకున్న తెలంగాణ బీఆర్‌ఎస్ లీడర్ల కుటుంబాలకు అంకితమైందని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయలేని సీఎం కేసీఆర్ కొత్త హామీలతో ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, వచ్చే 45 రోజులు ఇంటింటికి తిరిగి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి వివరించాలని సూచించారు.
ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు , ఏపీ సంఘటన మంత్రి మధుకర్, జిల్లా ఇన్‌చార్జి విద్యాసాగర్ రెడ్డి ,అసెంబ్లీ ప్రభరీ సతీష్ , జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి, ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, రాష్ట్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి కృష్ణయ్య, నాయకులు వెంకటరామయ్య, సులోచన, రాజు , పద్మా రెడ్డి, నారాయణ, హనుమంతరావు పాల్గొన్నారు.