
ముంబై: కేంద్ర యువజన క్రీడల శాఖ మంత్రి రక్షా ఖడ్సేకు చేదు అనుభవం ఎదురైంది. టీనేజ్ వయసున్న ఆమె కూతురిని ఆకతాయిలు వేధించారని పోలీస్ స్టేషన్లో కేంద్ర మంత్రి ఫిర్యాదు చేశారు. కేంద్ర మంత్రి కూతురికే రక్షణ లేకపోతే ఇక సామాన్య మహిళల పరిస్థితి ఏంటనే చర్చ సోషల్ మీడియాలో నడుస్తోంది. మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో తన కూతురు, ఆమె స్నేహితురాళ్లపై ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారని ముక్తైనగర్ పోలీస్ స్టేషన్ లో కేంద్ర మంత్రి రక్షా ఖడ్సే ఫిర్యాదు చేశారు. కొఠాలి గ్రామంలో జరిగిన సంత్ ముక్తై యాత్రకు రేఖా ఖడ్సే కుమార్తె, ఆమె స్నేహితురాళ్లు శుక్రవారం రాత్రి వెళ్లారు.
సోహం మాలి అనే యువకుడితో పాటు ఏడుగురు యువకులు రక్షా ఖడ్సే కూతురు, ఆమె ఫ్రెండ్స్పై వేధింపులకు పాల్పడ్డారు. సోహం మాలిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు. పోక్సో చట్టం కింద ఈ ఆకతాయిలపై కేసు నమోదు చేశారు. రక్షా ఖడ్సే కూతురిని వేధించడంతో పాటు ఫొటోలు, వీడియోలు తీస్తూ ఈ ఏడుగురు యువకులు ఇబ్బంది పెట్టినట్టు తెలిసింది. ఇలాంటి పరిస్థితి కేంద్ర మంత్రి, ఎంపీ అయిన తన కూతురికే వస్తే సామాన్య మహిళల పరిస్థితి ఏంటని ఖడ్సే విస్మయం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం ఫడ్నవీస్ తో పాటు డీఎస్పీతో కూడా మాట్లాడానని ఆమె చెప్పారు.
తాను గుజరాత్లో ఉండగా ఆ శివాలయంలో జరిగే జాతరకు వెళ్తానని తన కూతురు కాల్ చేసి అడిగిందని, భద్రతా సిబ్బందిని తీసుకుని వెళ్లాలని తనకు చెప్పానని రక్షా ఖడ్సే చెప్పారు. తన వ్యక్తిగత సిబ్బంది తన కూతురు, ఆమె స్నేహితురాళ్లతో ఉండగానే ఆకతాయిలు వేధింపులకు పాల్పడ్డారని ఆమె చెప్పారు. తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఆ యువకులు ఫొటోలు, వీడియోలు తీస్తుంటే వద్దని వారించారని, అయినా వినకుండా ఆ యువకులు ఇలా వేధింపులకు పాల్పడ్డారని కేంద్ర మంత్రి ఈ ఘటన గురించి వివరించారు.
ఆ యువకులకు మద్దతుగా 30 నుంచి 40 మంది గుమిగూడటంతో తన వ్యక్తిగత భద్రతా సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితిలో ఉండిపోయారని రక్షా ఖడ్సే ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిబ్రవరి 24న కూడా తన కూతురు ఒక పబ్లిక్ ఈవెంట్కు వెళ్లగా.. ఇదే గ్రూప్ వేధించారని తన కూతురు చెప్పిందని ఆమె తెలిపారు. ఈ గ్రూప్ స్కూల్కు వెళ్లే బాలికలను కూడా రోజూ ఇలానే వేధిస్తుంటారని ముక్తైనగర్ లో ఉండే కొందరు స్థానికులు తనకు చెప్పినట్టు రక్షా ఖడ్సే చెప్పారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.