
Piyush Goyal: ప్రస్తుతం ప్రపంచం శిలాజ ఇంధనాలతో నడిచే వాహనాల నుంచి తమ ప్రయాణాన్ని ఎలక్ట్రిక్ వాహనాల వైపు మళ్లుతున్నారు. భారత ప్రభుత్వం సైతం దేశంలో ఈవీలను ఎక్కువగా ప్రజలకు చేరువ చేసేందుకు వాటి ధరలు అందుబాటులో ఉండేలా చూసేందుకు ప్రొకక్షన్ ఇన్సెంటివ్ స్కీమ్స్ కూడా అందుబాటులో ఉంచిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దేశీయ ఆటగాళ్లైన టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి సంస్థలు తమ సాంప్రదాయ వ్యాపారమైన డీజిల్ పెట్రోల్ వాహనాల ఉత్పత్తి నుంచి ఈవీ శ్రేణికి విస్తరిస్తున్నాయి. ఈ క్రమంలోనే భారత మార్కెట్లలోకి ప్రపంచ దిగ్గజాలు అడుగుపెట్టడానికి తమ ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి.
కట్ చేస్తే అమెరికాకు చెందిన ప్రముఖ ఈవీ తయారీదారు టెస్లా చాలా కాలంగా భారత మార్కెట్లోకి తన ఎలక్ట్రిక్ కార్ మోడళ్లను విక్రయానికి ప్రయత్నాలు చేస్తోంది. అయితే దిగుమతి చేసుకున్న కార్లపై అధిక పన్నులను భారత ప్రభుత్వం విధించటంతో సంప్రదింపులు జరుపుతోంది. కొన్ని నెలల కిందట ముంబైలో షోరూమ్ ఏర్పుటుకు సైతం టెస్లా ఉద్యోగుల రిక్రూట్మెంట్ చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే టెస్లాను ప్రపంచ మార్కెట్లలో ఓడించిన చైనా ఈవీ కార్ల తయారీదారు బీవైడీ కూడా ప్రస్తుతం భారతదేశంలో తన వాహనాల విక్రయాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ తరుణంలో భారత మార్కెట్లలో బీవైడీకి యాక్సెస్ పరిమితం చేయాలని నిర్ణయించినట్లు భారత వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత్ ఎలాన్ మస్క్ సంస్థ టెస్లా నుంచి పెట్టుబడులు కోరుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు గోయల్ వెల్లడించారు. మనం ఇండియాలో ఎవరిని పెట్టుబడి పెట్టేందుకు అనుమతిస్తున్నాం అనే అంశం దేశ వ్యూహాత్మక ప్రయోజనాల దృష్ట్యా నిర్ణయించబడుతుందని ముంబైలో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో మాట్లాడుతూ కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతానికి బీవైడీకి నో చెబుతున్నట్లు ఆయన స్పష్టం చేశారు.
దీనికి ముందు గత ఏడాది చైనా ఈవీ దిగ్గజం బీవైడీ స్థానిక భాగస్వామి సంస్థతో కలిపి రూ.8వేల కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ముందుకురాగా భారత ప్రభుత్వం దానిని తిరస్కరించిన సంగతి తెలిసిందే. ఇదే క్రమంలో చైనాకు చెందిన మరో కార్ల తయారీ సంస్థ గ్రేట్ వాల్ మోటార్ కో కూడా భారత ప్రభుత్వం నుంచి నియంత్రణ అనుమతులను అందుకోవటంలో విఫలమైనందున ఇండియా మార్కెట్ల నుంచి కంపెనీ నిష్క్రమించింది. చైనాకు చెందిన చాలా కంపెనీల యాజమాన్య విధానంలో రహస్యంగా కమ్యునిస్టులు, మిలిటరీతో సంబంధాలు, తయారీ సంస్థలకు భారీగా సబ్సిడీలు రుణాల మాఫీ ద్వారా మార్కెట్లలో పోటీతత్వాన్ని చంపేందుకు చేస్తున్న ప్రయత్నాలుగా ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఉన్న భారత పాలసీల ప్రకారం దేశంతో భూభాగాన్ని పంచుకుంటున్న పొరుగుదేశాల నుంచి ఏదైనా పెట్టుబడులు చేయాలనుకుంటే వాటికి ముందుగా ప్రభుత్వ అనుమతి అనివార్యంగా ఉంది. దీనిద్వారా అసలు మన దేశంలో ఎవరు పెట్టుబడులు పెట్టొచ్చనే అంశాన్ని నిర్ణయించటం, రెగ్యులేట్ చేయటం వీలవుతోంది. ఈ నిబంధనల కిందే చైనాకు చెందిన బీవైడీ తెలంగాణకు చెందిన మేఘా ఇంజనరింగ్ కంపెనీతో కలిసి రూ.8వేల కోట్ల పెట్టుబడికి చేసిన ప్రయత్నాన్ని భారత ప్రభుత్వం అడ్డుకుంది. ఆ తర్వాత మేఘా సంస్థ ఎలక్టోరల్ బాండ్స్ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే.
నిబంధనలను సులభతరం చేయడానికి ప్రస్తుత ప్రయత్నంలో కొంత భాగం చైనా కంపెనీల నుండే వస్తున్నట్లు కొందరు భారత ప్రభుత్వ అధికారులు అనుమానిస్తున్నారు. పర్మిషన్స్ పొందటం కోసం భారతీయ సంస్థలకు అనుకూలంగా తమ వాటాలను తగ్గించుకోవడానికి కూడా ఈ చైనా సంస్థలు ముందుకొస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలాంటి ప్రయత్నాలను ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోంది.
టెస్లా ఇండియాలో ఉత్పత్తి ఇలా..
అమెరికాకు చెందిన ఈవీ దిగ్గజం ప్రస్తుతం కాంట్రాక్ట్ ఉత్పత్తి సామర్థ్యాలను ఇండియాలో ఉపయోగించుకోవాలని చూస్తోందని తెలుస్తోంది. ఉపయోగంలో లేని 25 శాతం సామర్థ్యాన్ని ఇండియాలో వాడుకోవాలనే ఆలోచనలో ఉంది. అయితే ఇక్కడ ఉండే సరఫరా గొలుసు అంతరాయాల కారణంగా టెస్లా సమయం వ-ృధాను అరికట్టేందుకు ఎక్కువగా తన గిగా ఫ్యాక్టరీల మీద ఆధారపడుతూ కొత్త దేశాలకు ప్రవేశించటం కష్టతరమౌతోంది. అయితే దేశంలో టెస్లా ప్లాంట్ ఏర్పాటుకు రూ.16 నుంచి 18వేల కోట్లు ఖర్చవుతుందని తెలుస్తోంది. ఇది బెర్లిన్, టెక్సాక్ కంటే సగం రేటుకే నిర్మాణం కానుంది. దీనికి కారణం తక్కువ ధరకు భూమి, లేబర్ అందుబాటులో ఉండటమే కారణంగా తెలుస్తోంది.
ఈవీల ఉత్పత్తిలో ఇండియా గ్లోబల్ హబ్ గా మారాలనుకుంటున్నప్పటికీ ఇక్కడ ఉన్న అధిక సుంకాలు టెస్లా వంటి సంస్థల ఎంట్రీకి పెద్ద అడ్డంకిగా మారుతున్నాయి. 2024 ఈవీ పాలసీలో కొన్ని సుంకాల తగ్గింపులు ప్రకటించినప్పటికీ అవి సరిపోవని టెస్లా చెబుతోంది. అయితే మరోపక్క దేశీయ ఈవీ తయారీ సంస్థలు మాత్రం సుంకాలను తగ్గించవద్దని ప్రభుత్వానికి సూచిస్తూనే ఉన్నాయి. అయితే తక్కువ ధరలను కోరుకునే భారత మార్కెట్లో టెస్లా కంటే బీవైడీ ఎక్కువగా ప్రయోజనాలను పొందే అవకాశాన్ని కలిగి ఉంది.